ఢిల్లీలో ప్రత్యేక హోదా రగడ: రాష్ట్రపతికి మొర, మేం సమర్థిస్తాం: పవార్
న్యూఢిల్లీ: ఏపీకి తక్షణం ప్రత్యేక హోదాను ప్రకటించాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంటుకు నోటీసులు ఇచ్చింది. ఈ ఉదయం లోకసభలో ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా, రాజ్యసభలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌లు నోటీసులు ఇచ్చారు.
పార్లమెంటు సాక్షిగా తీసుకున్న నిర్ణయాలు, నెరవేరుస్తామని ఇచ్చిన హామీలపై ప్రభుత్వం కదలాలని వారు డిమాండ్ చేశారు. విభజన చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నోటీసులో పేర్కొన్నారు. అంతకుముందు ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరా రెడ్డి తదితరులు కాంగ్రెస్ పెద్దలను కలిసి చర్చించారు.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా విషయమై రాష్ట్రపతిని కలవనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దానిని నెరవేర్చాలని వారు కోరనున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ సమర్థిస్తాం: శరద్ పవార్
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండును సమర్థిస్తామని శరద్ పవార్ చెప్పారు. ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, కాబట్టి గత ప్రభుత్వాల నిర్ణయాలు ప్రస్తుత ప్రభుత్వం గౌరవించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను తాము సమర్థిస్తామని చెప్పారు. విభజన సమయంలోనే ఏపీకి హోదాపై కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.












Click it and Unblock the Notifications