ఏపీలో షర్మిల ఆ పని చేయగలుగుతుందా..?
YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోండటం ఇక లాంఛనప్రాయమే అయింది. దేశ రాజధాని వేదికా కాంగ్రెస్ పార్టీలో చేరారామె. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
అనంతరం ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్ననారు. ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా షర్మిల అపాయింట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వవైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్. ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడం అంటే మాటలు కాదు. 2009లో చంద్రబాబు నెలకొల్పిన మహాకూటమిని ఎదుర్కొని, ప్రత్యేక తెలంగాణవాదాన్ని తట్టుకుని తిరుగులేని విజయాన్ని అందుకుంది.
విభజన తరువాత ఆ రోజులు ముగిశాయి. అది గత వైభవంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ సంపూర్ణంగా అమావాస్య రోజులను చూస్తోంది. ఇక్కడ మినహాయిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉనికి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్‌ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం విడగొట్టిన కాంగ్రెస్‌ను సీమాంధ్ర ప్రజలు తమ క్రోధాగ్నిలో భస్మం చేసేశారు. సమీప భవిషత్తులో కోలుకునే అవకాశం లేకుండా చేసారు.

కాంగ్రెస్‌లో కొమ్ములు తిరిగిన నాయకులందరూ 2019 ఎన్నికల్లో మట్టికరిచారు. దీనికి తోడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత అయన కుటుంబాన్ని, ముఖ్యంగా కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కర్కశ వైఖరిని అంగీకరించని ప్రజలు ఆ పార్టీని నేలమట్టం చేశారు.
2014, 2019 ఎన్నికలే దీనికి నిదర్శనం. కేంద్ర మంత్రులుగా పని చేసిన నాయకులు సైతం పట్టుమని పదివేల ఓట్లు కూడా సాధించలేకపోయారంటే ఏపీలో కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నోటా కన్నా కూడా తక్కువ సీట్లు తెచ్చుకుంది కాంగ్రెస్.

కేంద్ర మంత్రిగా పని చేసిన పల్లం రాజు కాకినాడలో పోటీ చేస్తే 8,640 ఓట్లు వచ్చాయి. ఇంకో కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే 9,585 ఓట్లు వచ్చాయి. ఇంకో సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1,384 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నోటాకు 2,340 ఓట్లు పడ్డాయి.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్లు వచ్చినా కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేయడం అసాధ్యం. ఇప్పుడు ఇంకెంత గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ ఏపీలో ఊపిరిపోసుకుంటుందనేది ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చని అంచనా వేస్తోన్నారు రాజకీయ విశ్లేషకులు.












Click it and Unblock the Notifications