మండలి చైర్మన్: కెసిఆర్ ప్రభుత్వంపై డిఎస్ నిప్పులు

ఇదిలావుంటే, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ)లో చర్చించకుండా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఎలా ఇస్తారని తెలంగాణ మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ ప్రశ్నించారు. ఈ విషయమై గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్లు 5 శాతానికి పెంచవద్దని వాదించిన రామకృష్ణారెడ్డిని అడ్వకేట్ జనరల్‌గా ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే రామకృష్ణారెడ్డిని రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలను తెరాసలో చేర్చుకోవడంపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన వారు ముందు పదవులకు రాజీనామా చేయాలని షబ్బీర్ డిమాండ్ చేశారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి బుధవారం 11 గంటలకు సమావేశం కానుంది. ఈ మేరకు సభ్యులకు కార్యదర్శి సదారాం వ్యక్తిగతంగా లేఖలు రాశారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకే చైర్మన్ ఎన్నిక ఉంటుందని ఆయన లేఖలో రాశారు. ఈ ఎన్నికకు రేపు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ పత్రాలు, ఎన్నిక విధానంపై వివరాలను ఆయన సభ్యులకు పంపించారు.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శాసన మండలిలో ప్రతిపక్ష నేత డి. శ్రీనివాస్, ఎమ్మెల్సీలు సోమవారం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. సంప్రదింపులు జరపకుండా శాసన మండలి చైర్మన్ ఎన్నిక పెట్టడం సరైంది కాదంటూ వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికను వాయిదా వేయాలని వారు గవర్నర్‌ను కోరారు.












Click it and Unblock the Notifications