జగన్ సర్కార్ కు సీపీఐ నారాయణ థాంక్స్- తన వీడియోపై స్పందించి పరిష్కరించినందుకు...
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేసే నేతల్లో సీపీఐ నారాయణ కూడా ఒకరు. పలు ప్రాంతీయ, జాతీయ అంశాలపై జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించే నారాయణ ఇవాళ ఓ విషయంలో మాత్రం ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. దీంతో నారాయణ ఎందుకు థ్యాంక్స్ చెప్పారనే విషయంలో ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి రూరల్ మండలంలోని తన స్వగ్రామం అయణంబాకం, దాని చుట్టూ ఉన్న దాదాపు పది గ్రామాలకు రోడ్డు వసతులు సరిగా లేవని గతంలో సీపీఐ నారాయణ వీడియో తీసి షేర్ చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదేశాలు ఇచ్చి రోడ్లు వేయించింది. తద్వారా 10 గ్రామాల ప్రజలకు మేలు జరిగింది. దీనిపై ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారని, సంబంధిత గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారని సీపీఐ నారాయణ ఇవాళ తెలిపారు.

వీడియో తీసి పెట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ గా తీసుకోవడం పట్ల తాను కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సీపీఐ నారాయణ తెలిపారు. ఏది ఏమయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రోడ్లు వేయడం పట్ల జగన్ ప్రభుత్వానికి తాను కూడా అభినందనలు తెలుపుతున్నట్లు నారాయణ పేర్కొన్నారు.రాజకీయాల్లో అరుదుగా కనిపించే దృశ్యాల్లో ఒకటిగా ఈ సందర్భం నిలిచింది. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ ప్రత్యర్ధి పార్టీలపై నిప్పులు చెరిగే వైసీపీ ప్రభుత్వం నారాయణ విషయంలో సానుకూలంగా స్పందించడం కూడా చర్చనీయాంశమైంది.