ఏపీలో మూడో ఫ్రంట్ ? చంద్రబాబుకు నారాయణ కీలక సూచన..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా విపక్షాల పొత్తుల వ్యవహారం ఇంకా తేలకపోవడంతో వచ్చే ఎన్నికల ఫలితంపై క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో పొత్తుల కోసం విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనిపై సీపీఐ నారాయణ ఇవాళ స్పందించారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడటం ఎందుకని ఆయన ప్రశ్నించారు. దీనికి బదులుగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదిస్తున్నారు.
ఏపీలో వైసీపీ-బీజేపీ మధ్య లివింగ్ టుగెదర్ కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ నేత నారాయణ తెలిపారు. ఈ రెండు పార్టీలు విడిపోయే అవకాశం లేదని కూడా విశ్లేషించారు. అలాగే వైసీపీతో పోటీ పడే స్ధాయికి బీజేపీ కూడా చేరలేదన్నారు. కాబట్టి బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడొద్దని చంద్రబాబుకు నారాయణ సూచించారు. ఇప్పటికైనా టీడీపీ మేల్కొని ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఏపీలో ఓ కూటమి తయారు చేయాలని చంద్రబాబుకు కీలక సలహా ఇచ్చారు.

ఏపీకి అన్ని విధాలుగా నష్టం చేసిన బీజేపీకి టీడీపీ ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సహకరించడం సరికాదని సీపీఐ నారాయణ చంద్రబాబుకు హితవు పలికారు. దీనికి బదులుగా రాష్ట్రంలో టీడీపీ,జనసేన, సీపీఐ, సీపీఎంలతో ఓ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తే వైసీపీ-బీజేపీ డబుల్ ఇంజన్ విఫలమవుతుందని సీపీఐ నారాయణ తెలిపారు. అది రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందని నారాయణ వెల్లడించారు. దీంతో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇప్పటికే చంద్రబాబు బీజేపీతో అంటకాగుతూ, ఆ పార్టీతో పొత్తు కోసం ఢిల్లీలోనూ తీవ్ర ప్రయత్నాలు చేసి వచ్చారు. ఈ నేపథ్యంలో సీపీఐ నారాయణ ఇచ్చిన సలహాను టీడీపీ ఏమేరకు పాటిస్తుందని చూడాల్సి ఉంది. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులను ఉద్దేశించి దక్షిణాదిలో వీరి ప్రభావం ఏమీ లేదని చంద్రబాబు తాజాగా ఢిల్లీ టూర్ ముగింపు సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిని కాదని కమ్యూనిస్టులు చంద్రబాబుతో కలుస్తారా అన్నది కూడా ఆసక్తికరమే.












Click it and Unblock the Notifications