టిడిపి-బిజెపి ల మధ్య యుధ్దం...ఇలాగ కూడానా:ఎవరు ముందో?
అమరావతి:మిత్రపక్షాల నుంచి బద్ద శత్రువులుగా మారిన టిడిపి-బిజెపి ల మధ్య మాటల యుథ్థం గత కొన్నాళ్లుగా తారా స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీల మధ్య వైరం అంతకంతకూ పెరుగుతుండటంతో తదనుగుణంగా ఇరు పార్టీలు పరస్పర విమర్శల దాడిని మరింత ముమ్మరం చేశాయి.
ఈ క్రమంలోనే కేవలం మాటల యుద్దానికే పరిమితం కాకుండా సోషల్ మీడియాలో పోస్టుల యుద్దం కూడా చేస్తున్న ఈ రెండు పార్టీలు తాజాగా కార్టూన్ల యుద్దానికి కూడా దిగాయి. సమకాలీన అంశాలపై వ్యంగాస్త్రాలను సంధిస్తూ రూపొందిస్తున్నఈ కార్టూన్ల యుద్దం ద్వారా ప్రత్యర్థి పార్టీని బాగానే టార్గెట్ చేయగలుగుతున్నాయి.
అయితే ఈ వ్యవహారంలోనూ ఫలానా కార్టూన్ తామే ముందు రూపొందించామని...దాన్ని ప్రత్యర్థి వర్గం కాపీ కొట్టిందని...వారికి కాపీ మాత్రమే చేతవుతుందంటూ ఆరకంగా మళ్లీ కామెంట్ల యుద్దానికి దిగుతున్నారు. విమర్శల పర్వంలో నయా ట్రెండ్ పై స్పెషల్ స్టోరి!

మిత్రుల నుంచి...శత్రువుల దాకా...
ఎన్నికల సమయంలో మిత్ర పక్షాలుగా మారిన టిడిపి-బిజెపి తదనంతరం ఎన్నికల్లో విజయం సాధించాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములగా కూడా మారాయి. అయితే నాలుగేళ్ల పాలన క్రమంలో ఎపికి కేంద్రం సరైన న్యాయం చేయలేదంటూ ఈ రెండు పార్టీల మధ్య మొదలైన విభేధాలు ఆ తరువాత పతాక స్థాయికి చేరి బద్ద శత్రువులుగా మారడంతో పాటు భాగస్వామ్యం తెంచుకోవడం జరిగిపోయింది. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్దం అంతకంతకూ తీవ్రమవడమే కాకుండా అనేక మార్గాల్లో ఈ ఇరుపార్టీలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఆ క్రమంలో టిడిపి మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక కార్టూన్ నెటిజన్లను విశేషంగా ఆకర్షించడంతో పాటు ఈ రెండు పార్టీల మధ్య పోరు మరింత తీవ్రతరం చేసింది.

టిడిపి ఫ్యాన్స్...కార్టూన్ పోస్ట్...ఇదే...
శ్రీమద్భాగవతం లోని గజేంద్ర మోక్షం ఘట్టాన్ని ఉదహరిస్తూ టిడిపి అభిమానులు ఈ కార్టూన్ ను తయారు చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చూడగానే అర్థం అయేట్లుగా చిత్రంచిన ఈ కార్టూన్ భావం ఏమిటంటే సరస్సులో గజరాజం లాంటి ఆంధ్రప్రదేశ్ మోడీ లాంటి మకరం నోట చిక్కి విలవిల్లాడుతూ శ్రీమహావిష్ణువును ప్రార్థించగా చంద్రబాబు శ్రీమహావిష్ణువులా వచ్చి తన సుదర్శన చక్రంతో అడ్డువేసి ఆంధ్రప్రదేశ్ ని రక్షించడం అనే కాన్సెప్ట్ తో ఈ కార్టూన్ చిత్రించడం జరిగింది. ఈ ఘట్టం జరుగుతుండగా జగన్, విజయసాయిరెడ్డి చేపల్లాగా వీక్షిస్తున్నట్లుగా చిత్రీకరించడం జరిగింది.

బిజెపి...కౌంటర్ కార్టూన్...
అయితే టిడిపి పోస్ట్ చేసిన ఈ కార్టూన్ పై బిజెపి అభిమానులు స్పందించారు. అసలు ఈ కార్టూన్ ముందుగా రూపొందించింది తమ బిజెపినే అని...టిడిపి తమ కార్టూన్ కాపీ కొట్టి పాత్రలు మార్చి సోషల్ మీడియాలో ఈ కార్టూన్ పోస్ట్ చేశారని కామెంట్లు పెట్టారు. కావాలంటే అసలు కార్టూన్ చూడండంటూ మరో కార్టూన్ ను పోస్ట్ చేశారు. టిడిపి శ్రేణులు ఏదైనా కాపీ కొట్టడమే తప్ప సొంతగా రూపొందించడం రాదని ఎద్దేవా చేశారు. దీంతో విస్తుపోవడం నెటిజన్ల వంతయింది.

ఎవరు ముందు?...కొత్త పుంతలు...
ఈ కార్టూన్ల యుద్దం విషయమై ముందు విస్తుపోయిన నెటిజన్లు...ఆ తరువాత ఎవరు ముందుగా ఈ కార్టూన్ రూపొందించి ఉంటారనే విషయమై కామెంట్ల చర్చ జరిపారు. అత్యధికులు టిడిపినే ఈ కార్టూన్ రూపొందించి ఉంటుందని అభిప్రాయపడగా, మరి కొంతమంది బిజెపికి మద్దతుగా మాట్లాడారు. ఏదేమైనా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వెరైటీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కార్టూన్లు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విమర్శల్లో కూడా ఇది ఒక సరికొత్త ట్రెండ్ కాగా ముందు ముందు ఇంకెన్ని వెరైటీ యుద్దాలు చూడాల్సివస్తుందోనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications