తీరాన్ని తాకిన తుఫాను : 80 కిమీ వేగంతో గాలులు : తూర్పు గోదావరి పై అధిక ప్రభావం
ముందు నుంచి అంచనా వేసిన విధంగానే పెథాయ్ తుఫాను తీరం దాటింది. తూర్పు గోదావరి జిల్లా ఖాట్రేని కోన వద్ద తుఫాన్ తీరం తాకింది. తీరం తాకే సమయంలో గంటకు 80 కిలో మీటర్ల వేగం తో గాలులు వీస్తున్నాయి. తూర్పు గోదావ రి జిల్లాలో అధికంగా ప్రభావం చూపుతోంది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురు స్తున్నాయి. ఆర్టీజీఎస్ కేంద్రంలోనే మంత్రులు మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు..
రెండు రోజులుగా కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్ తుపాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు అధికారులు ప్రకటించారు ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో తీరంలో పెనుగాలులు వీస్తున్నాయి. ఇది ఏడు జిల్లాలపై ప్రభావం చూపిస్తోం దని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు కాగా.. విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది.

విశాఖకు రావాల్సిన 14 విమానాలను రద్దు చేశారు. విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇక, తీరం తాకిన తరువాత పరిస్థితిని మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుండి మంత్రులు కళా వెంకటరావు, లోకేష్ లు పర్యవేక్షిస్తున్నారు. హోం మంత్రి చనరాజప్ప. ఆర్దిక మంత్రి యనమల తూర్పు గోదావరిలోనే మకారం వేసారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం విశాఖ కు చేరుకొని అక్కడి నుండి తూర్పు గోదావరి లో పర్యటనకు వెళ్లనున్నారు.
తుఫాను ప్రభావం ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలోనే అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ లోనూ తుఫాను కారణంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, ఖాట్రేని కోన, ఉప్పల గుప్తం మండలాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని ఆర్టీజీయస్ ఆ ప్రాంత అధికారులను అప్రమత్తం చేసింది.












Click it and Unblock the Notifications