
ఏపీలో ఆ ఆరు జిల్లాల్లో హైఅలర్ట్ - ముందస్తు సన్నాహాలు
అమరావతి: రాష్ట్రానికి మరో పెను తుఫాన్ ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం- తుఫాన్‌గా పరిణమించడానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఈ సాయంత్రానికి ఇది తుఫాన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావం ఏపీ, తమిళనాడులపై తీవ్రంగా ఉండబోతోంది. పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు పడనున్నాయి. ఏపీ దక్షిణ ప్రాంతం, తమిళనాడు ఉత్తర కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
అండమాన్‌కు దక్షిణ దిశగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం క్రమంగా ఆగ్నేయ దిశగా కదులుతోంది. ఈ సాయంత్రానికి తుఫాన్‌గా రూపాంతరం చెందనుంది. దీనికి మాండోస్‌గా నామకరణం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనికి ఈ పేరు పెట్టింది. అరబ్బీలో మాండోస్ అంటే ట్రెజర్ బాక్స్ అని అర్థం. దక్షిణ అండమాన్ సముద్రం - మలక్కా జలసంధికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్న ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది.

పశ్చిమ ఆగ్నేయ దిశగా కదులుతూ ఈ సాయంత్రానికి లేదా రాత్రి నాటికి తమిళనాడు తీరంలో ఉష్ణమండల తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావం ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలపై ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలో ఈ తుఫాన్ ప్రభావం ఆరు జిల్లాలపై ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది.
తుఫాన్ ప్రభావానికి గురయ్యే ఆరు జిల్లాల్లో అధికారులు హైఅలర్ట్‌ను ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సన్నద్ధం కావాలని జిల్లా అధికార, పోలీసు యంత్రాంగానికి సూచించారు. తుఫాన్ పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ను ఎదుర్కొనడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని అన్నారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని అంచనా వేశారు.
ముందుజాగ్రత్త చర్యగా ప్రస్తుతానికి 11 ఎస్డీఆర్ఎఫ్, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని సూచించారు. అటు తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల యంత్రాంగం, పుదుచ్చేరి ప్రభుత్వం అప్రమత్తం అయ్యాయి. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాయి. పుదుచ్చేరి ప్రభుత్వం 1070, 1077 టోల్ ఫ్రీ నంబర్లతో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది.