Cyclone Michaung: నెల్లూరు-బాపట్ల తీరానికి సమీపించిన పెను తుఫాన్..!!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మరింత బలపడింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయాల గగనతలంపై కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ఈ సాయంత్రానికి తుఫాన్‌గా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 3వ తేదీ నుంచి ఏపీ దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తర కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.
రాత్రి 11:30 గంటల సమయానికి ఈ వాయుగుండం పుదుచ్చేరి, చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నెల్లూరు- 740, బాపట్ల- 810, మచిలీపట్నం- 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

క్రమంగా ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతుందని, వచ్చే 24 గంటల్లో మిఛౌంగ్ తుఫాన్ (Cyclone Michaung)గా మారుతుందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్‌గా ఆవిర్భవించిన అనంతరం క్రమంగా ఇది ఏపీ తీరం వైపు దూసుకొస్తుందని అంచనా వేసింది. ఈ నెల 4వ తేదీన సాయంత్రం బాపట్ల- మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రస్తుతం దీని కదలిక గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ఇది సుడులు తిరుగుతున్నట్లు ఐఎండీ వివరించింది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని విశాఖపట్నంలోని సైక్లోన్ వార్నింగ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ సునంద తెలిపారు.
డిసెంబర్ 3వ తేదీ నుంచి తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఏపీ దక్షిణ కోస్తా జిల్లాలపై తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటుందని సునంద చెప్పారు. మత్స్యకారులెవరూ సముద్రంలో చేపలవేటకు వెళ్లకూడదని సూచించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, చెన్నై, తెన్‌కాశి, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో ఒక మోస్తరుగా ఉరుములు మరియు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నైలోని వాతావరణ కేంద్రం తెలిపింది.
విల్లుపురం, రాణిపేట, కడలూరు, తంజావూరు, నాగపట్నం, మైలదుత్తురై, తిరువారూర్, రామనాథపురం, తిరుప్పూర్, దిండిగల్, పుదుకోట్టై, విరుధ్ నగర్, నీలగిరి, థేని, పుదుకల్ జిల్లాల్లోని వచ్చే మూడు గంటల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుందని వివరించింది. నాగపట్నం, కడలూర్‌లను ఇదివరకే భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.












Click it and Unblock the Notifications