cylone michaung landfall : బాపట్ల వద్ద తీరాన్ని తాకిన మిచౌంగ్ తుపాను-3 గంటలు హైఅలర్ట్..
ఏపీ, తమిళనాడుల్ని వణికిస్తున్న మిచౌంగ్ తుపాను కొద్దిసేపటి క్రితం బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. బంగాళాఖాతంలో ఉన్న తుపాను తీరాన్ని తాకినట్లు ఐఎండీ నిర్ధారించింది. అయితే ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపు 3 గంటల సమయం పడుతుందని దాని వేగాన్ని బట్టి అంచనా వేస్తోంది. ఈ మూడు గంటల్లో కోస్తా తీర ప్రాంతం అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తోంది. తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు తప్పేలా లేవు.

మిచౌంగ్ తుపాను తీరాన్ని తాకినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా నిర్ధారించింది. మరో రెండు గంటల్లో ఇది పూర్తిగా తీరాన్ని దాటనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
కాబట్టి తుపాను తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. తుపాను ప్రభావంతో ఈరోజు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కూడా పడతాయని వెల్లడించింది.
మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఇప్పటికే కోస్తా తీరమంతా అప్రమత్తత కొనసాగుతోంది. తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేసిన అన్ని జిల్లాలకు ప్రభుత్వం ముందస్తుగానే నిధులు కేటాయించడంతో అధికారులు ఆ మేరకు సహాయక బృందాల్ని కూడా అందుబాటులో ఉంచారు. ముందు మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందని భావించినా నెమ్మదిగా కదులుతూ మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి బాపట్ల వద్దే మిచౌంగ్ తుపాను తీరం దాటేసింది. దీంతో అధికారులు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications