కిరణ్‌పై డిఎస్ అసహనం: టిడిపిపై సెటైర్, హీరో... ఆనం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలతో కేంద్రం తెలంగాణ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు డి శ్రీనివాస్ బుధవారం అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు శాఖను మార్చిన వ్యవహారాన్ని తాను ముఖ్యమంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
ఇది ఏమాత్రం మంచి సంప్రదాయం కాదన్నారు. కిరణ్ అలా చేస్తే అధిష్టానం విభజన ప్రక్రియను వేగవంతం చేస్తుందన్నారు. అకస్మాత్తుగా శాఖల మార్పు తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో కాంగ్రెసు పార్టీకి ఎమోషనల్‌గా టచ్ ఉందని చెప్పారు. భారతీయ జనతా పార్టీతో పొత్తో లేక విలీనమో తెలుగుదేశం పార్టీ తేల్చుకోవాలన్నారు.

కిరణ్ హీరో: అనం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ హీరో అని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసన సభ్యులు ఆనం వివేకానంద రెడ్డి వేరుగా అన్నారు. ఇన్నాళ్లు తెలంగాణ ప్రాంత నేతలు సమైక్యవాదుల గొంతు నొక్కారని మండిపడ్డారు. మంత్రుల శాఖలపై ముఖ్యమంత్రికి అధికారం ఉంటుందన్నారు.
వాణిజ్య పన్నుల శాఖను మంత్రి శ్రీధర్ బాబు సమర్థవంతంగా నిర్వహిస్తారనే ఉద్దేశ్యంతోనే కిరణ్ దానిని ఆయనకు కేటాయించారన్నారు. ఆయన అలా కేటాయించడాన్ని తప్పు పట్టడం సరికాదన్నారు. కాంగ్రెసు పార్టీ గంగానది వంటిదన్నారు.
శాఖల మార్పుపై పయ్యావుల
శ్రీధర్ బాబు శాఖ మార్పుపై టిడిపి నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. మంత్రుల శాఖ మార్పును రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. సభా వ్యవహారాలను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు, ముఖ్యమంత్రి ఈ పని చేసి ఉంటారన్నారు. మంత్రి వర్గానికి సంబంధించి ఏ మార్పైనా చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications