ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు - భక్తులకు దర్శనం ఇలా..!!
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. తొలిరోజు బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మ దర్శనం ఇవ్వనున్నారు. నేటి ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేసారు. నివేదనల కోసం మొత్తం ఆరుసార్లు దర్శనానికి బ్రేక్ ఇవ్వనునున్నారు. కనకదుర్గానగర్‌లోనే అన్నదానం, ప్రసాదాలు ఏర్పాటు చేసారు. ఉత్సవ కాంతులతో వెలిగిపోతున్న ఆలయ ప్రాంగణం వెలిగిపోతోంది.
సర్వం సిద్దం
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వంసిద్ధమైంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గడియలు ప్రవేశించగానే ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. పది రోజుల పాటు అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిని విద్యుత్ వెలుగులతో మరింత అందంగా ముస్తాబు చేశారు. ప్రధానాలయం పరిసర ప్రదేశాలను వివిధ రకాల పూలతో అలంకరించారు. తొలిరోజు అమ్మవారు శ్రీబాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. గత ఏడాది తొలిరోజు 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య 75-80 వేల వరకు వెళ్తుందని అంచనా.

భక్తులు ఇలా
సాధారణ భక్తులు వినాయకుడి ఆలయం నుంచి ఉన్న మూడు క్యూల్లో ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి వెళ్లాలి. ఓం మలుపు వద్ద ఈ మూడు క్యూలు ఐదుగా మారతాయి. వాటిలో ఒకటి రూ.500, వీఐపీ కోటాలో వచ్చిన వారికి, మరొకటి రూ.300, ఇంకొకటి రూ.100 భక్తులకు కేటాయించారు. మిగిలిన రెండు క్యూల్లో ఉచిత దర్శనం భక్తులు వెళ్లాల్సి ఉంటుంది. తొలిరోజు మినహా మిగతా రోజుల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. కాగా, రోజూ ఆరు వేర్వేరు సమయాల్లో దర్శనానికి బ్రేక్‌లు పడతాయి. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే సమయాల్లో దర్శనానికి అనుమతించరు.
మూలా నక్షత్రం వేళ
ప్రతి నైవేద్యానికి 10-15 నిమిషాల సమయం పడుతుంది. మొత్తంగా అరగంట వరకు దర్శనం నిలుపుదల చేస్తారు. ఇక రోజూ సాయంత్రం అమ్మవారికి సమర్పించే మహానివేదన సందర్భంగా గంటపాటు దర్శనానికి బ్రేక్ ఇస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు బయటకు వెళ్లడానికి మూడు ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మూడు మార్గాల్లో భక్తులు బయటకు వెళ్లవచ్చు. శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. మూలా నక్షత్రం రోజు అర్ధరాత్రి 2 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. రోజూ రాత్రి 11 గంటలకు దర్శనాలను నిలిపి వేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications