కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు - ప్రయాణీకులకు బిగ్ అప్డేట్..!!
దసరా వేడుకలు ఆరంభం అయ్యాయి. సెలవులు ప్రారంభం కావటంతో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిసి పోతున్నాయి. రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వచ్చే ప్రయాణికుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లల్లో భారీగా వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. మరో వైపు ప్రయివేటు ట్రావెల్స్ రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి.
దసరా సెలవులు ప్రారంభం కావటంతో... సొంత ఊళ్లకు వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది. దసరా సెలవుల కోసం మూడు నెలల ముందుగానే ప్రధాన రైళ్లల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. రద్దీకి అనుగుణంగా కొన్ని మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించినా... రిజర్వేషన్లు దొరకటం లేదు. పలు రైళ్లల్లో నో రూమ్ దర్శనమిస్తోంది. దీంతో... చాలా మంది సాధారణ బోగీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ సుదూర ప్రాంత సర్వీసుల్లో సీట్లన్నీ భర్తీ కావడంతో, బస్టాండ్లలో కరెంట్ బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఈనెల 16 నుంచి 25వ తేదీ వరకు అత్యధికంగా 5,261 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. రైల్వేశాఖ సైతం ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.

పెరుగుతున్న ప్రయాణాల సంఖ్య
పెరిగిన ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అవసరమైన మార్గాల్లో రైళ్లు.. బస్సులు దొరక్కపోవటం తో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ప్రయివేటు వాహనాలతో సొంత ఊళ్లకు వెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రయివేటు ట్రావెట్స్ దోపిడీ మొదలు పెట్టాయి. ఏపీకి వచ్చే ప్రైవేట్ బస్సుల టికెట్ ధరలను సాధారణ రోజుల కంటే డిమాండ్ కు అనుగుణగా రెట్టింపు వసూలు చేస్తున్నారు. చివరి మూడు రోజుల్లో ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏ రైలులోనూ ఖాళీలు లేవు. దీంతో చాలా మంది ఆ తేదీల కోసం ప్రయివేటు ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ.580 నుంచి రూ.700 వరకు ఉండే ఈ టికెట్ ధర రెట్టింపు తో బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో.. ప్రయివేటు వాహనాల్లో సొంత ఊళ్లకు చేరుకునేందుకు సిద్దం అవుతున్నారు. ఇక ఈ వారం మొత్తం జాతీయ రహదారి పైన ట్రాఫిక్ పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
