ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తా.. డేట్, టైం చెప్పు.. రామచందర్‌రావుకు మంత్రి పొన్నం సవాల్!
తెలంగాణలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. సర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, నిజమైన ఓటర్ల ఓట్లు పోయాయని ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఒక్క ఓటు కోల్పోయిన వ్యక్తిని అయినా తీసుకురాగలరా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చేసిన సవాల్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి సవాల్ విసిరారు.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం అనంతరం రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ఓటరు జాబితా నుంచి పేరు డిలీట్ అయిన ఒక్క ఓటరునైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ముందుకు తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే బోగస్, చనిపోయిన, డూప్లికేట్ ఓట్లను తొలగించిందన్నారు.

దీన్ని 'ఓటు చోరీ' అనడం ప్రజలను మోసగించడమేనని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై రాష్ట్రపతి కార్యాలయం ఆధారాలు అడిగినా సమర్పించలేదని కూడా పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. "ఓటు కోల్పోయిన ఒక్కరినైనా చూపించగలరా అని రామచందర్‌రావు అడిగారు. తేదీ, సమయం చెప్పండి.. ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తాను" అని మంత్రి పొన్నం సవాల్ చేశారు.
'సర్' పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్లు, తెలంగాణలో 70 లక్షలు, హైదరాబాద్‌లో 40 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లనే ఎక్కువగా తొలగించారని విమర్శించారు. ఓటరు జాబితా ప్రక్షాళన అవసరమేనని, కానీ అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకూడదని పొన్నం స్పష్టం చేశారు.
ఈ సవాళ్లు, ప్రతి సవాళ్ళ అంశంతో ఓటరు జాబితా సవరణ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తుండగా, బీజేపీ ఎన్నికల సంఘం చర్యలను సమర్థిస్తూ కాంగ్రెస్ ఆరోపణలను ఖండిస్తోంది. మరి రాం చందర్ రావు సవాల్ కు స్పందించిన పొన్నం మేం రెడీ అంటే, రాం చందర్ రావు దీనికి మళ్ళీ ప్రతి స్పందిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.














Click it and Unblock the Notifications
