ఆ ఒక్కటి జరిగుంటే నాలుగు ముక్కలుగా పాకిస్తాన్..! రాజ్ నాథ్ సంచలన వ్యాఖ్యలు..!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన నౌకాదళం మౌనంగానే అద్బుత పనితీరును కనబర్చిందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కితాబిచ్చారు. ఇవాళ ఐఎన్ఎస్ విక్రాంత్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా నేవీ ఏ స్ధాయిలో చుక్కలు చూపించిందో గుర్తుచేసుకున్నారు. 1971 యుద్ధాన్ని మించి పాకిస్తాన్ ను మన నేవీ ఇబ్బంది పెట్టిందని ఆయన తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత నేవీ ఇతర బలగాలు (ఆర్మీ, ఎయిర్ ఫోర్స్)తో కలిసి పోరాటం చేసి ఉంటే పాకిస్తాన్ నాలుగు ముక్కలయ్యే అవకాశం వచ్చిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. 1971 యుద్ధంలోనే భారత నేవీ పోరాటంతో పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసిందని, ఇప్పుడు ఇతర బలగాలతో కలిపి ఉమ్మడి పోరు చేసి ఉంటే పాకిస్తాన్ ను నాలుగు ముక్కలు చేసి ఉండేదని రాజ్ నాథ్ వెల్లడించారు.

ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రస్తుతం అరేబియా సముద్రంలో మోహరించి ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్దనౌకలో ఆయన నేవీ ఉన్నతాధికారులతో కలిసి యుద్ద సన్నద్ధతలపై చర్చించారు. ఈ సందర్భంగా నేవీ పనితీరుపై రాజ్ నాథ్ ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన నేవీ.. పాకిస్తాన్ నేవీని తీవ్రంగా దెబ్బతీసిందని, వారి ఆర్మీకి సైతం చుక్కలు చూపించిందని రాజ్ నాథ్ తెలిపారు.

ఈ మొత్తం సమగ్ర ఆపరేషన్‌లో నేవీ పాత్ర అద్భుతమైనదని, ఆపరేషన్ సిందూర్ సమయంలోవైమానిక దళం పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసినప్పుడు, అరేబియా సముద్రంలో దూకుడుగా మోహరించి సాటిలేని సముద్ర డొమైన్ అవగాహన, సముద్ర ఆధిపత్యం పాకిస్తాన్ నావికాదళాన్ని దాని సొంత తీరాలకే పరిమితం చేశాయన్నారు. వారు బహిరంగ సముద్రంలోకి రావడానికి కూడా ధైర్యం చేయలేకపోయారన్నారు.












Click it and Unblock the Notifications