ఏపీ గవర్నర్‌కు ఢిల్లీ పిలుపు- జగన్ టూర్ తర్వాత కాల్- అజెండా ఇదేనా ?
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఢిల్లీ రావాలని కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు వచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చేసి వచ్చిన మూడు రోజుల వ్యవధిలోనే గవర్నర్ హరిచందన్‌కు ఢిల్లీ పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, మూడు రాజధానుల అంశం పెండింగ్‌లో ఉండటం, విభజన సమస్యలు ఇలా పలు అంశాలపై ఈ టూర్‌లో గవర్నర్‌తో కేంద్రంలో పెద్దలు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గవర్నర్‌కు హస్తిన పిలుపు
ఏపీ గవర్నర్ హరిచందన్ ఢిల్లీ వెళ్లి చాలా రోజులైంది. కరోనా నేపథ్యంలో ఆయన రాష్ట్రానికే, రాజ్‌భవన్‌కే పరిమితం అవుతున్నారు. తాజాగా ఆయనకు ఢిల్లీ రావాలని కేంద్ర హోంశాఖ వర్గాల నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై రాజ్‌భవన్ నుంచి అధికారికంగా ప్రకటనేదీ వెలువడలేదు. అయినప్పటికీ గవర్నర్ ఢిల్లీ టూర్‌పై అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదీ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండటం, జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో గవర్నర్ హరిచందన్‌కు హస్తిన పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ టూర్‌లో గవర్నర్.. ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్‌షానూ కలిసే అవకాశముంది.

జగన్ టూర్ నేపథ్యంలో గవర్నర్ టూర్
తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కీలకమైన కేంద్రమంత్రుల్ని సైతం కలిశారు. ఏపీలో నెలకొన్న పరిణామాల్నివివరించడంతో పాటు పెండింగ్ సమస్యలను వారి దృష్టికీ తీసుకెళ్లారు. అధికారికంగా ప్రభుత్వం చెప్పకపోయినా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలపై హోంమంత్రి అమిత్‌షాతో జగన్ చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్‌కు పిలుపురావడాన్ని బట్టి చూస్తే జగన్ చర్చించిన అంశాలపై ఫాలో అప్ కోసం గవర్నర్‌ను రప్పిస్తున్నారా అన్న ప్రచారం జరుగుతోంది.

అజెండాలో రఘురామ, మూడు రాజధానులు ?
ఢిల్లీ పెద్దల నుంచి గవర్నర్‌కు వచ్చిన కాల్ సమయం, సందర్భం బట్టి చూస్తే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు వ్యవహారంతో పాటు ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న మూడు రాజధానుల అంశంపైనా కేంద్ర పెద్దలు చర్చించే అవకాశాలున్నాయి. రఘురామరాజు వ్యవహారంలో పెట్టిన రాజద్రోహం కేసు, సీఐడీ కస్టడీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ ప్రభుత్వం విమర్శలపాలవుతోంది. దీంతో ఈ వ్యవహారంలో రఘురామ చేసిన ఫిర్యాదులపై కేంద్ర పెద్దలు గవర్నర్ వివరణ తీసుకోవచ్చని తెలుస్తోంది. అలాగే పెండింగ్‌లో ఉన్న మూడు రాజధానుల వ్యవహారంలో చట్టబద్దంగా తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్‌కు క్లారిటీ ఇచ్చే అవకాశాలూ ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications