వైసీపీ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు-ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో-ఎక్కడెక్కడంటే..
ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని దర్యాప్తుచేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 40 చోట్ల ఇవాళ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలోని పలునగరాలతో పాటు ఢిల్లీలోనూ పలువురు ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. ఉదయం నుంచి ఈడీ అధికారులు ఆయా ప్రముఖుల ఇళ్లకు చేరుకుని దాడులు కొనసాగిస్తున్నారు. ఇందులో ఓ వైసీపీ ఎంపీ నివాసంలోనూ ఈడీ తనిఖీలు జరుగుతుండటం కలకలం రేపుతోంది.
వైసీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇళ్లలో ఇవాళ ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఎంపీ నివాసంతో పాటు నెల్లూరులోని ఆయన ఆస్తులపైనా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా మద్యం వ్యాపారి అయిన మాగుంట కుటుంబం దశాబ్దాలుగా దీన్ని నిర్వహిస్తోంది. ఉమ్మడి ఏపీలోనూ మాగుంట కుటుంబానికి మద్యం వ్యాపారాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆయన అధికారంలో ఉన్న పార్టీల్లో ఉంటారనే ప్రచారం కూడా ఉంది. అలాగే రాజకీయాల్లో ప్రత్యర్ధులపై విమర్శలకు కూడా మాగుంట దూరంగానే ఉంటుంటారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే తెలంగాణలో పలువురు టీఆర్ఎస్ నేతల్ని ఈడీ టార్గెట్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఏపీలోనూ అందులోనూ వైసీపీకి పట్టున్న నెల్లూరు జిల్లాలో మాగుంట ఇళ్లు, ఆఫీసులపై లిక్కర్ స్కాంలో ఈడీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలో నేతలు దీనిపై చర్చించుకుంటున్నారు. ఇవాళ ఈడీ దాడులు ముగిసిన తర్వాత సాయంత్రానికి వీటి వివరాలను వెల్లడించే అవకాశముంది. ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా జరుగుతున్న దాడులు కావడంతో వైసీపీతో పాటు ఇతర పార్టీల్లోనూ ఇది చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications