వాయుగుండం ప్రభావం: దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు
విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. రిజర్యాయర్లకు నీరు వచ్చి చేరుతోంది. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. తిరుమల జలాశయాల్లోకి భారీగా నీరు చేరింది.
హరిణి వద్ద మరో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్‌రోడ్డులోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. లింక్‌రోడ్డు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. తిరుమలలోని ఆకాశగంగ ధార, కూమర ధార, పసుపు ధార నిండాయి. తిరుమల కొండపైకి ద్విచక్రవాహనాల అనుమతిని రద్దు చేశారు.
కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉండడంతో సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకు ఘాట్ రోడ్డును మూసేశారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కురిసిన భారీ వర్షంతో స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తోంది. కేవీపీపురం మండలం రాజుగకండ్రిగ వద్ద ఉన్న కల్వర్టు తెగిపోయింది. దీంతో పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాళంగి రిజర్వాయర్‌లోకి వరదనీరు భారీగా చేరింది.

స్వర్ణముఖి నదలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. తమిళనాడుకు చెందిన భక్త బృందం నదీతీరం వద్ద వాహనం నిలిపి దర్శనానికి వెళ్లారు. ఈలోగా ప్రవాహ ఉధృతికి వాహనం కొట్టుకుపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలోని గార్లయనది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొర్లగుంటవారి పల్లె ప్రాజెక్టు, తిలకవాటివారి పలెల్ల ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది.
కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రాజంపేట దగ్గర ఉన్న చక్రాలమడుగు వాగులో ఆరుగురు యువకులు చిక్కుకున్నారు. వారిలో నలుగురిని స్థానికులు రక్షించారు. మరో ఇద్దరు యువకులు తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు.
కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో కురిసిన భారీ వర్షాల వర్షాల వల్ల ముత్తేరు, గున్నేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. చిట్వేలు బ్రిడ్జి మునిగిపోవడంతో రైల్వేకోడూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజంపేటలోని ఊటుకూరు చెరువుకు గండి పడింది. చక్రాలమడుగు వాగు పొంగిపొర్లడంతో కడప- తిరుపతి రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
నెల్లూరు జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. గూడూరులో కురిసిన భారీ వర్షాలతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత సరఫరా లేక గూడూరు డివిజనలో అంధకారం అలముకుంది. ఆత్మకూరు తహసీల్దారు ఆఫీసు, కోర్టు, పోలీసుస్టేషనలలోకి వర్షపునీరు చేరింది. మర్రిపాడు మండలంలోని చేతమన్నేరువాగు పొంగిపొర్లుతుంది. చెన్నై - విజయవాడ మార్గంలో రైళ్లు గంటపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.
నెల్లూరులో మంగళవారం ఉదయం మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వర్షం వల్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయని, విద్యుత్తు స్తంభాలు కూలిపోవడం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందని ఆయన చెప్పారు. మధ్యాహ్నాన్నికి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications