Pawan Kalyan Janavani: డిప్యూటీ హోదాలో తొలిసారి పవన్ జనవాణి-అక్కడే అధికారులకు ఫోన్లు..!
ఏపీలో జనసేన పార్టీ జనంలోకి వెళ్లేందుకు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం మంచి స్పందన తెచ్చుకుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా కొన్ని వందల జనవాణి కార్యక్రమాల్ని రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిర్వహించారు. ఇందులో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. చివరికి ప్రజా మద్దతుతో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ తన జనవాణి కార్యక్రమాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.

గతంలో జనసేన అధినేతగా జనవాణి కార్యక్రమాల్ని నిర్వహించిన పవన్ కల్యాణ్ ఇవాళ తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ఇందుకు వేదికైంది. దీంతో పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు జనం ఎగబడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం జనసేనానికి తమ సమస్యలు చెప్పుకుని వాటి పరిష్కారం కోరారు. దీంతో ఆయన కూడా అంతే వేగంగా వాటిపై స్పందించారు.

ఇవాళ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు అభినందనలు తెలుపుతూ ప్రసంగించిన పవన్.. సభ ముగియగానే నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు.

అక్కడ అప్పటికే తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలను చూసి ఆఫీసు బయటే కుర్చీలు వేయించి అక్కడే వారితో భేటీ అయ్యారు. జనం నుంచి వినతులు తీసుకున్న పవన్.. వాటి పరిష్కారం కోసం వెంటనే అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరించిన పవన్.. మిగతా వాటిని అధికారులకు పంపారు. దీంతో జనవాణికి ఫిర్యాదులతో వచ్చిన జనం సంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications