Raghurama: రఘురామ కేసులో కీలక పరిణామం-బీహార్ ఐజీ అరెస్ట్..!
ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు (Raghurama krishnam raju)పై గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కస్టడీ టార్చర్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన ప్రస్తుత బీహార్ ఐజీ సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కొంతకాలంగా సునీల్ నాయక్ ను విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో ఏపీ పోలీసులే బీహార్ వెళ్లి ఆయన్ను అరెస్టు చేశారు.
రఘురామరాజును కస్టడీలో హింసించిన కేసులో సునీల్ నాయక్ ను తమ పోలీసులు అరెస్టు చేసినట్లు గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు. ఆయన్ను ప్రస్తుతం బీహార్ రాజధాని పాట్నా నుంచి గుంటూరుకు తీసుకొస్తున్నారు. ఇక్కడికి తెచ్చాక గుంటూరు కోర్టులో సునీల్ నాయక్ ను ప్రవేశపెట్టి రిమాండ్ కోరే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఇతర నిందితులుగా ఉన్న మరో ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ తో పాటు ఇతర నిందితులపై చర్యలు కొనసాగుతున్నాయి.

2021లో వైసీపీ రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు.. సీఎంగా ఉన్న వైఎస్ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసేవారు. దీంతో ఆయన్ను విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ రాజద్రోహం కేసు పెట్టి జైలుకు పంపారు. సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్టు తర్వాత గుంటూరు జైలుకు తరలించారు. అక్కడ రఘురామపై కస్టడీలో అధికారులు పక్కా ప్లాన్ తో దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నారు. అప్పట్లో తనను కస్టడీలో హింసించారని రఘురామ చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు సైతం స్పందించి ఆయనకు బెయిల్ ఇవ్వడమే కాకుండా సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో టెస్టులు చేయించి దాడి నిజమేనని తేల్చింది. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ జరకపోవడంతో కూటమి ప్రభుత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications