విజయవాడలో డయేరియా కలకలం-ఇంటింటి సర్వే-పుకార్లపై మంత్రి క్లారిటీ..!
విజయవాడలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలకు తోడు కలుషిత నీటి కారణంగా నగరంలోని కొత్త రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే వాంతులు, విరేచనాలతో జనం ఆస్పత్రుల పాలవుతున్నారు. పరిస్ధితి గమనించిన అధికారులు తాత్కాలిక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వారికి చికిత్స అందిస్తున్నారు. ఇవాళ బాధితుల్ని మెడికల్ క్యాంప్ లో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ పరామర్శించారు.
న్యూ రాజరాజేశ్వరి పేటలో స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా, వీఎంసి కమిషనర్ ధ్యాన చంద్ర తో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై డీఎంహెచ్ ఓ సుహాసిని,మున్సిపల్ అధికారులతో మంత్రి చర్చించారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మంత్రి, ఎమ్మెల్యే పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

ఆర్ ఆర్ పేట లో ఇంటింటి సర్వే చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. సమస్య ఎందుకు వచ్చిందనేది గుర్తిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. వదంతులు నమ్మవద్దని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వెల్లడించారు. డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగారని మంత్రి నారాయణ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారన్నారు. డయేరియా కేసులు వచ్చిన వెంటనే మున్సిపల్,వైద్యారోగ్య అధికారులు,ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారని తెలిపారు.

ఇప్పటికే చాలా మందికి వాంతులు,విరేచనాలు తగ్గాయని, హాస్పిటల్ నుంచి మరో కొంతమంది డిశ్చార్జి అవుతున్నారని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఒకసారి నీటి శాంపిల్స్ పరీక్షించారని, ఎలాంటి సమస్య లేదని తేలిందన్నారు. డ్రైన్ వాటర్ ఎక్కడైనా తాగునీటి పైప్ లైన్ లో కలుస్తుందేమో అనేది కూడా పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాధితుల అందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications