టీ బిల్లు: దిగ్విజయ్ సింగ్ మిషన్ కంప్లీట్ (పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ముసాయిదా బిల్లుపై తన మిషన్‌ను పూర్తి చేసినట్లే కనిపించారు. తెలంగాణ బిల్లు హైదరాబాద్ చేరుకోవడానికి ముందు గురువారంనాడు వచ్చిన ఆయన గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు. ఆయన ఇక్కడి నుంచి బెంగళూర్ వెళ్లినట్లు సమాచారం.
రెండు రోజుల పాటు ఆయన ఇరు ప్రాంతాల నాయకులతో చర్చలు జరిపారు. ఏ మాత్రం తీరిక లేకుండా తెలంగాణ కాంగ్రెసు నాయకులతో, తెలంగాణ జెఎసి నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులకు భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటే టికెట్లు ఇస్తామని తెలంగాణ జెఎసి నాయకులకు ఆఫర్ ఇచ్చారు.

అప్పుడూ ఇప్పుడూ..
కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా నియమితులైన తర్వాత ఇంతకు ముందు హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ విభజన జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ముసాయిదా బిల్లు సోమవారం అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

నవ్వుతూనే...
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు దిగ్విజయ్ సింగ్ నవ్వుతూనే సమాధానాలు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి విభజనకు సహకరిస్తారని నమ్మకంగా చెప్పారు.

ఎంపిక చేసుకుని జవాబులు..
మీడియా ప్రతినిధులను ఎంపిక చేసుకుని ప్రశ్నలను ఆహ్వానించి సమాధానాలు ఇచ్చారు. రాష్ట్ర విభజనకు తాము కట్టుబడి ఉన్నామని మరోసారి చెప్పారు.

యూటర్న్ తీసుకున్నాయని వ్యాఖ్య
మొదట తెలంగాణకు అంగీకరించిన వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నాయని ఆయన విమర్శించారు. చంద్రబాబు తన డిమాండ్లేమిటో చెప్పడం లేదని అన్నారు.

తెలంగాణ నేతలకు భరోసా..
తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందని దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పార్టీ నాయకులకు భరోసా ఇచ్చారు. ఆయన పక్కన తెలంగాణకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇలా..

ఎక్కడైనా ఉండవచ్చు..
దేశంలో ఎక్కడైనా ఆస్తులు సంపాదించుకుని, నివసించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, హైదరాబాదులోని సీమాంధ్రులకు రక్షణ ఉంటుందని ఆయన చెప్పారు.

జగన్ డిఎన్ఎ మాదే..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ డిఎన్ఎ తమ పార్టీ డిఎన్ఎ ఒక్కటేనని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడడానికి ఆయన మరోసారి అస్త్రం అందించారు.

కెసిఆర్ మావాడేనని చెప్పకనే చెప్పారు
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమవాడేనని ఆయన చెప్పకనే చెప్పారు.

జెసి దివాకర్ రెడ్డికి షాక్
విపరీతంగా రెచ్చిపోయిన రాయలసీమ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి పోతూ పోతూ దిగ్విజయ్ సింగ్ షాక్ ఇచ్చారు. జెసికి షోకాజ్ నోటీసు ఇస్తామని చెప్పారు.

తెలంగాణపై వ్యూహాత్మకంగా..
ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి దిగ్విజయ్ సింగ్ యంత్రంలా పనిచేశారు. వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చే వరకు చూశారు. అసెంబ్లీలో బిల్లుపై అభిప్రాయ సేకరణ జరిపి వెనక్కి పంపితే వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్ర విభజన చేయడానికి వీలవుతంది. అదే ఆయన పూర్తి చేయాల్సిన పని.
తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీ ముందుకు సోమవారం బిఎసిలో నిర్ణయం తీసుకుని తెచ్చే అవకాశాలున్నాయని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. అస్వస్థతకు గురైన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పరామర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి తమకు సహకరిస్తారని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై సభ్యులు స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చునని ఆయన అన్నారు.
రాయలసీమకు చెందిన పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇస్తామని చెప్పడం ద్వారా మిగతా సీమాంధ్ర శానససభ్యులకు హెచ్చరిక ఇచ్చినట్లయింది. సమైక్యాంధ్ర కావాలని, రాష్ట్రాన్ని విడదీయకూడదని మాట్లాడుతన్న శాసనసభ్యులపై, మంత్రులను ఆయన వెనకేసుకొస్తూనే సోనియా దిగిపోవాలని, కాంగ్రెసు చచ్చిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన జెసి దివాకర్ రెడ్డిపై చర్యలకు కాంగ్రెసు అధిష్టానం ఉపక్రమించినట్లే కనిపిస్తోంది. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయనలో ఏ విధమైన టెన్షన్ కనిపించలేదు. ఉల్లాసంగా నవ్వుతూ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయన హావభావాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
అభిప్రాయం పంపించడానికి వచ్చే ఏడాది జనవరి 23వ తేదీ వరకు రాష్ట్రపతి రాష్ట్రానికి అవకాశం ఇచ్చినప్పటికీ ఈ శాసనసభా సమావేశాల్లోనే పని ముగించేందుకు దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తున్నాయి. జగన్ డిఎన్ఎ తమ డిఎన్ఎ ఒక్కటే అనడం ద్వారా మరోసారి వివాదానికి ఆజ్యం పోశారు. పార్టీని తమ పార్టీలో కలుపుతామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారని ఆయన అన్నారు. తద్వారా తెరాస విలీనం జరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. లేదంటే పొత్తయినా ఉంటుందనే నమ్మకం కావచ్చు. ఏమైనా, రాష్ట్ర విభజన ఈ ఎన్నికల లోపు జరిగే విధంగా రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాలను ఆయన కొలిక్కి తెచ్చినట్ల కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications