బాబు యోచన: ఎపి అవతరణ వేడుకలపై డైలమా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలపై ప్రభుత్వం డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేడుకలు నవంబర్ 1వ తేదీన జరుగుతూ వచ్చింది. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో తెలుగు ప్రజలందరికీ ఒక రాష్ట్రం ఏర్పడిందనే ఉద్దేశంతో నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహిస్తూ వచ్చారు. హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల విలీనంతో నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
అయితే, ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అవతరణ జూన్ 2వ తేదీన జరిగింది. నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ వేడుకలు జరపడం సరైంది కాదనే వాదన వినిపిస్తోంది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు జరపాలని రాష్ట్ర ఉద్యోగులు భావిస్తున్నారు. నిజానికి, చంద్రబాబు నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాలను విజయవాడలో జరపాలని భావించారు. కొత్త పరిణామాల నేపథ్యంలో ఆయన తన ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీన గానీ జూన్ 8వ తేదీన గానీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల విషయంలో పెద్దగా వివాదం లేదు. ఆ రాష్ట్రం స్పష్టంగానే ఉంది.
మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి తొలుత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరోవైపు, నిజాం పాలన నుంచి విముక్తి పొంది హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. ఈ రెండు రాష్ట్రాల విలీనం ద్వారా 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో జరిగిన ఉద్యమం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన హైదరాబాద్ రాష్ట్ర ప్రాంతాలు విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
ప్రస్తుతం పాత ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ నామాన్నే కొనసాగిస్తూ దాని నుంచి విడిపోయిన హైదరాబాద్ రాష్ట్ర ప్రాంతాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఏమైనా, నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు నిర్వహించకూడదని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయవాడలో తలపెట్టిన అవతరణ వేడుకలను రద్దు చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications