ఈ కేంద్రప్రభుత్వ పథకంతో.. 20వేల రూపాయలు మీ ఖాతాలో.. కానీ!
దేశంలోని నిరుపేద మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిల్లో చాలా పథకాలు ప్రజలకు తెలియకపోవడం వలన లబ్ధిదారులకు చేరువ కావడం లేదు. ఈ పథకాల పైన పెద్దగా అధికారులు ప్రచారం చేయకపోవడం, ప్రజలు వీటి గురించి తెలుసుకోకపోవడం వెరసి కొన్ని పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయి.
నిరుపయోగంగా మారుతున్న కేంద్ర పథకాలు
కొన్ని పథకాలను అమలు చేయడానికి నిధులు ఉన్నప్పటికీ వాటిని ఎవరు వినియోగించుకోకపోవడంతో ప్రభుత్వ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అటువంటి పథకాలలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఒకటి. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం గురించి ఈరోజుకి ప్రజలకు పెద్దగా తెలియదు.

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం.. 20వేల రూపాయల ఆర్ధిక భరోసా
ఈ పథకంలో కుటుంబ పెద్ద అనారోగ్యం లేదా ఏదైనా ప్రమాదం జరిగి, లేదా ఇతరత్రా అనుకోని కారణాలతో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం వీరికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ సహాయం ఒక్కసారి మాత్రమే అందిస్తుంది. 2017లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి సంవత్సరం ఈ స్కీం ద్వారా 7,794 కుటుంబాలు సాయం పొందవచ్చు.
60 కోట్ల రూపాయలు ఎలాంటి వినియోగం లేకుండా సెర్ప్ వద్ద నిల్వ
సరైన అవగాహన లేకపోవడం కారణంగా ఈ పథకాన్ని పొందలేకపోతున్నారు. గ్రామ, మండల స్థాయిలలో ఈ పథకం పైన ప్రచారం జరగడం లేదు. దీంతో చాలా జిల్లాలలో ఈ పథకానికి దరఖాస్తులు రావడం లేదు. ఇక ఈ పథకం కింద మంజూరైన నిధులు 60 కోట్ల రూపాయలు ఎలాంటి వినియోగం లేకుండా సెర్ప్ వద్ద నిల్వ ఉన్నాయి.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం నియమ నిబంధనలు
ఈ పథకం నుండి లబ్ధి పొందాలంటే దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మరణించిన కుటుంబ పెద్ద వయసు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. మరణం అనారోగ్యం, ప్రమాదం లేదా ఇతరత్రా కారణాలతో సంభవించినదిగా ఉండాలి. కుటుంబ పెద్ద మరణించిన తర్వాత రెండు సంవత్సరాల లోపు ఎప్పుడైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇలా దరఖాస్తు చేసుకుంటే మీ ఎకౌంట్ లో 20 వేలు
దరఖాస్తు చేసుకోవడానికి మరణ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి.దరఖాస్తును ముందుగా తహసిల్దార్ కు ఇస్తే, ఐకెపి, రెవిన్యూ అధికారుల పరిశీలించి ఆర్డీవోకు పంపుతారు. ఆ తర్వాత ఆర్డిఓ నుండి సెర్ప్ సీఈవో ఆమోదిస్తే 20వేల రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.
కుటుంబ పెద్ద మరణించిన కష్ట కాలంలో సాయం
ఈ పథకం పైన అవగాహన లేకపోవడం వల్ల, ఇలాంటి పథకం ఉంది అని తెలియక పోవడం వల్ల అర్హులైన వారు దీని నుండి సహాయం పొందలేకపోతున్నారు. ఇప్పటికైనా జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఉందనేది గుర్తించి కుటుంబ పెద్ద మరణించిన కష్టకాలంలో కేంద్రం అందించే ఆర్థిక భరోసాను పొందండి.












Click it and Unblock the Notifications