భారతీయులకు ట్రంప్ మరో బిగ్ షాక్ ..! 50 లక్షల వీసాలపై..!
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారతీయులు సహా విదేశీ పౌరులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై తనిఖీలు నిర్వహిస్తూ వారిని స్వదేశాలకు పంపేస్తున్న ట్రంప్.. భారీగా వీసాల్ని, గ్రీన్ కార్డుల్ని కూడా రద్దు చేసేస్తున్నారు. అలాగే కొత్తగా వీసాలు, గ్రీన్ కార్డుల ఇచ్చే విషయంలోనూ సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. ఇప్పుడు ఇదే క్రమంలో మరో షాక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పౌరులకు ఇచ్చిన 55 మిలియన్ల అమెరికా వీసాల్ని సమీక్షించాలని ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భారతీయ పౌరులకు ఇచ్చినవే 5 మిలియన్ల వీసాలు ఉన్నాయి. వీరందరి వీసాలను చెక్ చేస్తారు. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే వాటిని రద్దు చేస్తారు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న భారతీయుల వీసాల్లో ఉల్లంఘనలు గుర్తిస్తే వెంటనే బహిష్కరించి స్వదేశానికి పంపేయాలని భావిస్తున్నారు.

అమెరికా జాతీయ భద్రత, ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలా వీసాలను తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సమీక్షించబోతున్న వీసాల్లో పర్యాటకులు, విద్యార్ధులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారాల కోసం వచ్చిన పర్యాటకులు కూడా ఉన్నారు. వీరు వీసాలు కలిగి ఉండేందుకు అర్హులా కాదా, గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉంటున్నారా, నేరచరిత్ర ఏమైనా ఉందా, వీరి నుంచి అమెరికాలో పౌరులకు హాని ఉందా, తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే అంశాల్ని పరిశీలిస్తారు.

ఇందుకోసం వారి సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంకు ఖాతాలు, ఇమ్మిగ్రేషన్ రికార్డులు తనిఖీ చేస్తారు. ఈ ఏడాది తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం వీసా ఇంటర్వ్యూల్లో ఎలక్ట్రానిక్ పరికరాల్లో ప్రైవసీ సెట్టింగ్స్ డిసేబుల్ చేయకూడదు. అలాగే మిగతా నిబంధనలు కూడా పాటించి వీసాలు తీసుకున్నారా లేదా అనేది పరిశీలిస్తారు. వీటిలో ఎక్కడైనా తప్పు జరిగినట్లు తేలితే వారి వీసాలు రద్దు చేసి దేశ బహిష్కరణ చేయడం ఖాయంగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications