వైసీపీకి డబుల్ షాక్- విశాఖ ఆఫీసుకూ నోటీసులు- తాడేపల్లిలో కూల్చివేతల వేళ..!
ఏపీలో అధికారం కోల్పోయిన బాధలో ఉన్న వైసీపీకి కూటమి ప్రభుత్వం వరుస షాకులిస్తోంది. తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ సీఆర్డీయే, ఇతర శాఖల అధికారులు కూల్చేశారు.అదే సమయంలో విశాఖలో తాజాగా నిర్మించిన ఆఫీసుకూ గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ అధికారులు నోటీసులు పంపారు. దీంతో వైసీపీకి డబుల్ షాక్ తగిలిగినట్లయింది. విశాఖలో నిర్మించిన పార్టీ కార్యాలయం అక్రమమని అందులో పేర్కొన్నారు.
విశాఖ జిల్లాలోని ఎండాడలో సర్వే నంబర్ 175/4 లో ఉన్న రెండు ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కార్పోరేషన్ అధికారులు ఇవాళ వైసీపీకి నోటీసులు పంపారు. జీవీఎంసీకి కాకుండా అనుమతుల కోసం వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేయడం, అక్కడా అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై వివరణ కోరుతూ ఈ నోటీసులు జారీ అయ్యాయి.

వారం రోజుల్లో ఈ వ్యవహారంపై సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నోటీసులు అంటించారు. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించిన విశాఖ వైసీపీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం తాడేపల్లిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో వైజాగ్ ఆఫీసుపైనా అలాంటి చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది.
వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో పలు చోట్ల పార్టీ కార్యాలయాలకు స్ధలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చుకుంది. వాటిలో కొన్ని ఆఫీసులు ఇప్పటికే నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిపై దృష్టిసారిస్తోంది. నిబంధనలకు అనుగుణంగా లేకపోతే మాత్రం కూల్చివేతలకు ఆదేశాలు ఇస్తోంది. ఇందులో భాగంగానే తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న కేంద్ర కార్యాలయం కూల్చివేశారు. విశాఖలో ఆఫీసు తర్వాత ఇతర పార్టీ ఆఫీసులపైనా అధికారులు దృష్టిసారించబోతున్నట్లు తెలుస్తోంది.
Download











Click it and Unblock the Notifications