DSC: అభ్యర్థులకు పరీక్షగా మారుతున్న నిర్ణయాలు, గందరగోళం..!!
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో అధికారుల నిర్ణయాలు అభ్యర్ధులకు సమస్యగా మారుతున్నాయి. ఎంతో కాలంగా డీఎస్సీ కోసం వేచి చూస్తున్న అభ్యర్ధులకు పరీక్షల నిర్వహణపైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తొలుత సంతోషాన్ని ఇచ్చింది. ఉద్యోగాల కోసం భారీ సంఖ్యలో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పరీక్షల అమల్లో భాగంగా తొలుత విడుదల చేసిన హాల్ టికెట్ల నుంచి ప్రస్తుతం పరీక్షల మధ్య సెంటర్ల మార్పు నిర్ణయాలు.. యోగా ఈవెంట్ కోసం పరీక్షల వాయిదా అభ్యర్ధులకు సమస్యగా మారుతోంది.
అధికారుల తీరుతో
ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ పరీక్షల కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకొన్నారు. పరీక్షలకు సిద్దం అయ్యారు. అయితే, అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో మెగా డీఎస్సీ రాస్తున్న అభ్యర్థుల్లో గందరగోళం.. ఆందోళన కనిపిస్తోంది. పరీక్షల నిర్వహణలో భాగంగా తొలుత హాల్ టికెట్ విషయంలో అభ్యర్ధులు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికీ హాల్ టికెట్ల గందరగోళం కొనసాగుతోంది. మే 31వ తేదీన తొలిసారిగా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థికి ఇంగ్లీష్ ప్రొఫీషియెన్సీ టెస్టుకు పరీక్ష కేంద్రంగా కర్నూలులో ఖరారు చేసారు. కాగా, తాజాగా . జూన్ 24వ తేదీ జరగనున్న పరీక్ష కోసం జూన్ 18వ తేదీన హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ డీఎస్సీ నిర్వాహకుల నుంచి అభ్యర్థులకు పదే పదే ఫోన్లు వచ్చాయి.

అంతా అయోమయం
అంతకుముందే జరిగిన టీజీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పరీక్షకు సంబంధించి అప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నామంటూ అభ్యర్థుల నుంచి సమాధానం వచ్చింది. లేదు మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోండి అంటూ నిర్వాహకుల ఒత్తిడి చేస్తున్నారు. దీంతో.. అనుమానం వచ్చిన అభ్యర్థులు మరోసారి డౌన్‌లోడ్ చేసుకోగా పరీక్ష కేంద్రం మారిన సంగతి చూసి షాక్ అవ్వటం అభ్యర్దుల వంతు అయింది. మే 31న డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌లో పరీక్ష కేంద్రంగా కర్నూలు... జూన్ 18న డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై అదే పరీక్షకు సెంటర్‌గా ఎమ్మిగనూరుగా ఉండటం చూసి పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న అభ్యర్ది పరిస్థితి అయోమయంగా మారింది. అప్పటికే ఏర్పాట్లు చేసుకున్న అభ్యర్థులు.. తీరా పరీక్ష కేంద్రం మార్పుతో అభ్యర్థులు డైలమాలో పడ్డారు.
ఏంటీ గందరగోళం
ఇలాంటి గందరగోళం మధ్య మెగా డీఎస్సీ..పరీక్ష నిర్వహించడం ఏంటని అభ్యర్ధులు ప్రశ్నిస్తు న్నారు. పరీక్షలకు హాజరయ్యే వారికి చివరి నిమిషంలో ఇలా టెన్షన్‌కు గురిచేయడమేంటని నిలదీస్తున్నారు. చాలామందికి హైదరాబాద్ కేంద్రంగా ఒక పరీక్ష, రాష్ట్రంలో మరో ప్రాంతంలో మరో పరీక్ష, ఇంకో ప్రాంతంలో ఇంకో పరీక్ష కోసం కేటాయించారు. అభ్యర్ధుల్లో చాలా మంది గర్భిణీలు ఉన్నారు. వారు తాజా నిర్ణయాలతో అసలు ఎందుకు దరఖాస్తు చేసామనే ఆవేదనతో కనిపిస్తు న్నారు. ఇంత గందరగోళం మధ్య, సమయం ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించడం అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీ పరీక్షను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications