జనసేనలోకి తూ.గో. వైసీపీ సహా ఇద్దరు కీలక నేతలు, అదే దార్లో కొందరు: పవన్ ఏమన్నారంటే
రాజమహేంద్రవరం/హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నాయకులు గురువారం జనసేన పార్టీలో చేరారు. వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, తూర్పు గోదావరి కాంగ్రెస్ నేత పంతం వెంకటేశ్వర రావు (పంతం నానాజీ) హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడారు.
Recommended Video

జనసేన మన అందరి పార్టీ అని చెప్పారు. కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని, అదే పార్టీ లక్ష్యమని చెప్పరు. పార్టీలోకి వీరిద్దరిని సాదర ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఇది తన పార్టీ అని ఎప్పుడూ అనుకోలేదని, నా అనే భావన ఎప్పుడూ తనకు ఉండదన్నారు. మనది, మనం అనే భావనలే ఉంటాయన్నారు.

నేను నమ్మిన సిద్ధాంతాలనే చెబుతున్నా
తాను నమ్మినన సిద్ధాంతాలను, సాధన చేసిన సిద్ధాంతాలనే చెబుతున్నానని పవన్ అన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించాలన్నారు. నాలుగు గోడల మధ్య కూర్చుని సమస్యలను పరిష్కరిస్తామంటే కాదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయని, వాటికి పరిష్కరాలు చూపించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలన్నారు.

బలంగా నిలబడతా, ఒత్తిళ్లు ఎదుర్కొంటా
రాజకీయాలు స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తాను చేయడం లేదని పవన్ చెప్పారు. దీర్ఘకాలిక ప్రయోజనాలతో భావితరాల క్షేమం కోసం ఈ రంగంలోకి వచ్చానని చెప్పారు. తనకు రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా బలంగా నిలబడతానని చెప్పారు. ఒత్తిళ్లను ఎదుర్కొంటానని చెప్పారు. పార్టీ కోసం చిత్తశుద్ధిగా పని చేసే వారికి అండగా ఉంటానని చెప్పారు.

గిరి గీసుకొని రాలేదు
రాజకీయాల్లో ఈ పని చేయాలని, ఈ పని చేయకూడదని గీత గీసుకుని తాను రాలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ముఖ్యమంత్రి అవుతామా, ప్రభుత్వాలను స్థాపిస్తామా అనేది తర్వాత విషయమని చెప్పారు. ముందు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఆయన అన్నారు. పార్టీలో చిత్తశుద్ధితో పని చేసే వారికి అండగా నిలుస్తామని చెప్పారు.

నాలుగు గోడల మధ్య, జీవోలు ఇస్తే సరిపోదు
నటుడిగా తాను సినిమాలలో ఉన్నప్పుడు తన మనసు అంతా కష్టాల్లో, బాధలలో ఉన్న ప్రజల గురించి ఆలోచనలతో నిండిపోయేదని పవన్ చెప్పారు. వర్ధమాన రాజకీయాల్లో అవినీతి, నీతి రెండు ఉన్నాయని చెప్పారు. అంతా అవినీతిమయని ప్రజలు పట్టించుకోకుంటే బాధలు తెలియవని చెప్పారు. మనుషులందరినీ ఒకే భావజాలంతో దగ్గర చేసి, ఒక తాటిపై నడిపించాలన్నారు. నాలుగు గోడల మధ్య కూర్చోని సమస్యలను పరిష్కరించాలని అంటే కుదరదన్నారు. ఇందుకు జీవోలు ఇస్తే సరిపోదన్నారు.

గోదావరి జిల్లాల్లో మరెంతోమంది నేతలు
సినిమాలలో వలె రెండు మూడు గంటల్లో సమస్యలు నిజ జీవితంలో పరిష్కారం కావని పవన్ చెప్పారు. జనసేన కొత్త పార్టీ అని, ఇది తొలి తరమని, ఆరంభంలో ఉందని, కష్టనష్టాలు ఉంటాయని, కలిసికట్టుగా ఎదుర్కోవాలని చెప్పారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రాజకీయాలు అంటే విపక్షాలపై దుమ్మెత్తిపోయడం కాకుండా, ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకోవడం అని నిరూపించిన నేత పవన్ అన్నారు. పంతం నానాజీ మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో మరెంతో మంది నేతలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తాము టిక్కెట్ ఆశించకుండా వచ్చామని చెప్పారు. పవన్ ఏ బాధ్యతలు ఇచ్చినా సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications