Ebola Alert: ఏపీలో ఎబోలా వైరస్ భయాలు-ఎయిర్ పోర్టులు, సీపోర్టుల్లో స్క్రీనింగ్..!
భారత్ లో ఎబోలా వైరస్ వ్యాప్తి భయాలు నెలకొంటున్నాయి. ఈ మేరకు కేంద్రం చేసిన హెచ్చరికలతో (Ebola Alert) ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విదేశాల నుంచి వాయు, సముద్ర మార్గాల్లో వచ్చే ప్రయాణికులపై ఫోకస్ పెట్టింది. వీరికి ఎయిర్ పోర్టుల్లో, సీ పోర్టుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్రంతో తాజాగా రాష్ట్ర అధికారులు పంచుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఇవాళ వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలు, పడకలు, వైద్య సిబ్బంది, అత్యవసర సామగ్రి, అనుమానిత కేసుల నిర్వహణకు తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. ఇందులో భాగంగా తిరుపతి, భోగాపురం, విజయవాడ విమానాశ్రయాల్లో ఎబోలా అనుమానిత లక్షణాలున్న వారికి స్క్రీనింగ్ చేసేందుకు వైద్య సిబ్బందిని సిద్ధం చేశామని తెలిపారు.

అలాగే విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు ఓడరేవుల్లోనూ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించామన్నారు. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సన్నద్ధతను పరీక్షించేందుకు నవంబర్ 12న మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎబోలా అనుమానిత కేసుల వైద్య నిర్వహణకు రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు కార్యదర్శి వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్‌బాబు వివరించారు. మొత్తం 46 పడకలు, 3,288 పీపీఈ కిట్లు, 104 నమూనా సేకరణ కిట్లు, ఐదు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు కేంద్ర అధికారులకు తెలిపారు.














Click it and Unblock the Notifications
