టీడీపీకి ఎన్నికల భయం: చంద్రబాబు మతానికి లింక్ పెట్టి ఆరోపణలు,ఎస్ఈసీకి ఫిర్యాదుల మర్మమిదేనా; హాట్ డిబేట్ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయా? ఎన్నికల్లో ఓటమి భయం చంద్రబాబు అండ్ కో ను వేధిస్తుందా? ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుండి ఆరోపణలు ఫిర్యాదులతో టీడీపీ నేతలు అధికార వైసీపీపై విరుచుకుపడుతున్న కారణం అదేనా? అంటే వైసీపీ నేతలు అవుననే అంటున్నారు. వరుస ఓటములతో చంద్రబాబు పార్టీ ఎన్నికల ఆందోళనలో ఉన్నట్టు తేల్చి చెప్తున్నారు. ఇక తాజాగా మరోమారు ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు, టిడిపి నేతల ఫిర్యాదుల మతలబు అదే అన్న చర్చ వైసీపీ వర్గాలలో జోరుగా జరుగుతుంది.

ఏపీలో ఎన్నికలు ఏవైనా సరే .. విజయం వైసీపీ ఖాతాలో, టీడీపీకి తలనొప్పిగా ఎన్నికల ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా అధికార వైసిపి భారీ విజయాన్ని నమోదు చేస్తుండటం తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం డైజెస్ట్ కావడం లేదు. ఎన్నికల ప్రక్రియ అనగానే పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం, ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీ నేతల ఆందోళనకు అద్దం పడుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం లేదన్నది తెలుగుదేశం పార్టీ పదేపదే చేస్తున్న ఆరోపణ. అలా ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని టీడీపీ అంచనా. అందుకే ఏపీలో ఇంతకుముందు ఎన్నికలు జరగని మున్సిపోల్స్ కు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దీపావళి పండుగ రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించడంపై సంచలన ఆరోపణలు చేశారు. టిడిపి నేతలు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసిపి దౌర్జన్యాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఏపీలో మోగిన మరో మున్సిపోల్స్ నగారా .. కొనసాగుతున్న నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు కార్పొరేషన్ తో పాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలలోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. అలాగే గతంలో ఎన్నికలు నిర్వహించిన ఏడు కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీలలో మరణించిన కార్పొరేటర్లు కౌన్సిలర్ల ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అంతేకాదు ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు వాళ్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి .ఈనెల 15వ తేదీన ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా బుధవారం నుండి మొదలైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం వరకు కొనసాగుతుంది.

అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ విజయం సాధించటంతో ఎన్నికలంటేనే భయపడుతున్న టీడీపీ
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, పంచాయతీ ఎన్నికల్లోనూ, వివిధ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధిస్తూ ఘన విజయాన్ని దక్కించుకుంటుంది. రాష్ట్రంలో ప్రజలంతా తమ వైపే ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలు దుకాణం మూసి వేయాల్సిందే నని ఎన్నికల తరువాత పదేపదే వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్ష పార్టీలు ఏ విమర్శలు చేసినా, ఎన్నికల ఫలితాలను చూపించి వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎందుకు వస్తున్నాయి అని భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.

తాజా మున్సిపోల్స్ పై చంద్రబాబు తీవ్ర అసహనం
తెలుగుదేశం పార్టీ మాత్రం ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి, తెలుగుదేశం పార్టీ ఫెయిల్ కావడానికి వైసిపి అధికార దుర్వినియోగం చేస్తుందని, నామినేషన్ కూడా దాఖలు చేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, వైసిపి అరాచక పాలన లో టీడీపీ అభ్యర్థుల పై దాడులు పెరిగిపోయాయని ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ మొత్తంగా ఎన్నికల ప్రక్రియను తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల ముంగిట తాజాగా చంద్రబాబు నామినేషన్ల దాఖలు ప్రక్రియ పై అసహనం వ్యక్తం చేశారు.

మతం ప్రస్తావన తెచ్చి ఎన్నికల ప్రక్రియకు లింక్ పెట్టిన చంద్రబాబు.. కారణం అదే అన్న వైసీపీ
హిందువుల పండుగ దీపావళిని చేసుకుంటుంటే పైశాచికంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పండుగ రోజు మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన వెంటనే నిలదీసిన ఆయన ఇతర మతాల పండుగలు ఉంటే ఎన్నికల ప్రక్రియ చేపట్టే వారా అంటూ ప్రశ్నించారు. పండుగకు, ఎన్నికల ప్రక్రియకు మతం లింకును పెట్టి చంద్రబాబు విమర్శలు చేయడం, చంద్రబాబు ఎన్నికలంటే భయపడుతున్నారు అని అర్థమయ్యేలా చెప్తుందని వైసిపి నేతలు అంటున్నారు. దీపావళి పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలు పెడితే ఏమైనా కొంప మునిగి పోతుందా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు ఎన్నికల ప్రక్రియ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఎస్ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదులు షురూ
ఇక ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వైసిపి దౌర్జన్యాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో టిడిపి నేతలు జీవి ఆంజనేయులు, అశోక్ బాబు కలిసి కార్యదర్శి కన్నబాబుకు విజ్ఞప్తి చేశారు. విపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని, కొందరు అధికారులు వైసీపీ తరపున పని చేస్తున్నారని మండిపడ్డారు. ఆన్ లైన్ లో నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైసిపికి అనుకూలంగా వ్యవహరించే అధికారిని కుప్పం మున్సిపాలిటీలో నియమించారని ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని టిడిపి నేతలు కోరారు.
Recommended Video

టీడీపీ ఓటమి భయమే ఆరోపణలకు, ఫిర్యాదులకు కారణం అంటున్న వైసీపీ
టీడీపీ ఆరోపణలు, ఫిర్యాదులు చూసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దొరక్క టిడిపి తంటాలు పడుతుందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు అవుతుందని, ఓటమి భయంతోనే చంద్రబాబు అండ్ కో సంచలన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారని, చంద్రబాబు మతం కార్డును కూడా తెర మీదకు తీసుకువచ్చి తంటాలు పడుతున్నాడు అని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications