బాబుపై ఆధారాలు చూపించగలరా: కెసిఆర్‌కు ఎర్రబెల్లి సవాల్
హైదరాబాద్: తెలంగాణలోని ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడ్డుపడినట్లు ఆధారాలు చూపాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ టీడీపీ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణలోని ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు అడ్డు పడుతున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. దీనిపై ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. తమ పార్టీ నుంచి వెళ్లి టిఆర్ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలపై కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం తప్పుడు నివేదికలు పంపిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రాజెక్టులకు వెళ్లాలని ఆయన సూచించారు.

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు కార్యకర్తలు టీఆర్‌ఎస్ భవన్‌ను ముట్టడించారు. కేసీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ భవన్‌లోకి వెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో మాల విద్యార్థుల ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాలలకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరిసిస్తూ సోమవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ఎన్సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విద్యార్థులు అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రివర్గ విస్తరణలో మాలలకు చోటు కల్పించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications