మాచర్లకు పిన్నెల్లి రిటర్న్ ? హైకోర్టు ఊరటతో రీఎంట్రీకి సన్నాహాలు !
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో మాచర్లలోని పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటన కూడా ఒకటి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పోలింగ్ కేంద్రంలోకి అనుచరులతో వెళ్లి ఈవీఎం ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారనే అనుమానంతో ఆయన ఇలా ఈవీఎం ధ్వంసం చేస్తూ వెబ్ కెమెరాకు పట్టుబడ్డారు. దీంతో ఈసీ ఆయన అరెస్టుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.
మాచర్లలో అభ్యర్ధిగా బరిలో ఉన్నందున, ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేసుకోవాలనే కారణం చూపి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు నుంచి బెయిల్ పొందారు. దీంతో జూన్ 5 వరకూ ఆయన్ను అరెస్టు చేయకుండా హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పరారీలో ఉన్న ఆయన.. తిరిగి మాచర్ల వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హైకోర్టులో వినిపించిన వాదనల ప్రకారం కౌంటింగ్ కోసం ఏజెంట్ల నియామకం, ఇతర ఏర్పాట్లు ఆయన చేసుకోవాల్సి ఉంది.

దీంతో మాచర్లకు తిరిగి వచ్చేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే టీడీపీ నేతలు ఛలో మాచర్లకు పిలుపునివ్వడంతో ఈసీ వారిని మాచర్లకు వెళ్లకుండా అడ్డుకుంది. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు కూడా చేసింది. ఇప్పుడు పిన్నెల్లి తిరిగి మాచర్లలో ఎంట్రీ ఇస్తే పరిస్ధితులు ఎలా మారతాయన్న దానిపై అధికారులు నిఘా పెట్టారు. అయితే మాచర్లకు రాకుండా కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోవడం కష్టం కాబట్టి ఆయన రీఎంట్రీ ఖాయమని చెప్తున్నారు. అయితే అది ఎప్పుడు అన్నది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications