టీడీపీలోకి మాజీ కేంద్రమంత్రి: ఆరు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు
అమరావతి: మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నేడో రేపో ఆయన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పచ్చ కండువాను కప్పుకోనున్నారు. కాగా కడప జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా సాయి ప్రతాప్ ఏపీ రాజకీయాల్లో ఎదిగారు.
సాయి ప్రతాప్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చేరనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనుంది. కడప జిల్లాలోని రాజంపేట పార్లమెంట్ నియోజక వర్గం నుంచి సాయి ప్రతాప్ 1989 నుంచి 1999 వరకు వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు.

1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తన ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీకి చెందిన గుణిపాటి రామయ్యపై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ 2004 నుంచి 2014 వరకు రెండు సార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి గెలుపొందారు.
మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మిధున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. పొత్తులో భాగంగా రాజంపేట టికెట్‌ను బీజేపీకి ఇవ్వగా, బీజేపీ తరుపున మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.












Click it and Unblock the Notifications