నారాయణ డబ్బులు పంపారు, టీడీపీని ఓడించేలా - అనిల్ సంచలనం..!!
మాజీ మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ మాజీ మంత్రి నారాయణ పైన ఆరోపణలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్యర్ధిగా నారాయణ బరిలో దిగనున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలే లక్ష్యంగా అనిల్ కొద్ది రోజులుగా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నారాయణ గతంలో టీడీపీ అభ్యర్ధును ఓడించేందుకు తనకు డబ్బులు పంపారని వెల్లడించారు.
టీడీపీ లక్ష్యంగా అనిల్
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నారాయణ పైన అనిల్ విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లొ మరోసారి నెల్లూరు అర్బన్ నుంచి నారాయణ బరిలోకి దిగేలా టీడీపీ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లాలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారారు. టీడీపీలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఆనం, కోటంరెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయటం లాంఛనంగా మారుతోంది. ఈ సమయంలో మాజీ మంత్రి అనిల్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆనం, నారాయణ లక్ష్యంగా కామెంట్స్ చేస్తున్నారు.
నారాయణ డబ్బులిచ్చారు
ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ పైన ఎమ్మెల్యే అనిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను ఓడించేందుకు డబ్బులు పంపారని అనిల్ చెప్పుకొచ్చారు. తనకు పంపిన డబ్బులు వాపస్ పంపానని అనిల్ పేర్కొన్నారు.
సందర్భం రానందున ఇన్నాళ్లు ఈ విషయం బయట పెట్టలేదని చెప్పారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. అవసరమైతే ప్రమాణానికి సిద్దమని అనిల్ ప్రకటించారు. టిడిపిలో జెండా మోసిన వారిని మోసగించడం మామూలేనని అనిల్ పేర్కొన్నారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్ ల పరిస్థితి ఇందుకు నిదర్శనమని అనిల్ వివరించారు.

ఇదే సమయంలో.. తాను లోకేష్ పై చేసిన విమర్శలకు జిల్లా వ్యాప్తంగా టిడిపి అలెర్ట్ అయిందంటే తన బలమెంతో అర్థమవుతోందని అనిల్ చెప్పుకొచ్చారు. నారాయణ పై తాను చేసిన ఆరోపణలు కాదనగలరా అని ప్రశ్నించారు. తాజాగా అనిల్ సీఎం జగన్ ను కలిసారు. ముఖ్యమంత్రితో మంతనాల తరువాత అనిల్ నెల్లూరులో తిరిగి యాక్టివ్ అయ్యారు. టీడీపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన పై పోటీ చేసి గెలవాలని లోకేశ్.. ఆనం కు సవాల్ చేసారు. ఇప్పుడు నారాయణ పైన అనిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీని పైన నారాయణ స్పందన చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications