
ఆళ్ళగడ్డలో ఫ్యాక్షన్ పడగ : మంత్రి పేరుతో స్కార్పియో రెక్కీ.. భూమా అఖిలప్రియ అనుచరుడి హత్యకు కుట్ర !!
ఆళ్లగడ్డలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు తెరమీదికి వస్తున్నాయా ? మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడి హత్యకు కుట్ర చేశారా ? తాజాగా గోవిందపల్లి గ్రామం లో పట్టపగలే రెక్కీ నిర్వహించడం ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నారా? ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో ఉన్న ఒక స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా తిరగడం వెనుక హత్య కుట్ర ఉందా ? అంటే అవునేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆళ్లగడ్డ స్థానికులు.

సీమలో మళ్ళీ ఫ్యాక్షన్ అలజడి .. వేడెక్కిన కర్నూలు జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చూస్తే ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ తెర మీదికి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి . కడప ,అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనలు, పలువురి పై జరుగుతున్న దాడులు, ఇటీవల కాలంలో ఆరుగురి దారుణ హత్యలు మళ్లీ ఫ్యాక్షన్ పడగ నీడన ప్రజలు ఉంటున్నారు అన్న అనుమానాన్ని కలిగిస్తున్నాయి. ఇక తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో ఫ్యాక్షన్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

గోవిందపల్లెలో పట్టపగలే రెక్కీ
కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవింద పల్లె గ్రామంలో పట్టపగలే ఓ కారు అనుమానస్పదంగా రెక్కి నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నిన్న గోవింద పల్లె గ్రామంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో ఉన్న స్కార్పియో వాహనం పట్టపగలే రెక్కీ నిర్వహించి, ఆ గ్రామానికి చెందిన అఖిల ప్రియ ప్రధాన అనుచరుడు రవి చంద్రా రెడ్డి ఇంటి ముందు కారు ఆపారు. ఇది గమనించిన రవిచంద్రారెడ్డి భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గోవిందపల్లె కు చేరుకున్న పోలీసులు వారిని వెంబడించారు.

తప్పించుకునే క్రమంలో మహిళకు డీ.. కారు వదిలేసి పారిపోయిన ఆగంతకులు
కారును అతివేగంగా నడిపే క్రమంలో ఓ మహిళను కూడా ఢీకొట్టి, తప్పించుకునే ప్రయత్నం చేశారు. కారు ఢీకొట్టడంతో మహిళకు స్వల్ప గాయాలు కాగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక అనుమానాస్పదంగా తిరిగిన స్కార్పియో వాహనాన్ని స్థానికులు పోలీసులు వెంబడించడంతో అగంతకులు కారును వదిలేసి నల్లమల అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రెక్కీ నిర్వహించిన వాహనం రవిచంద్రారెడ్డి ఇంటిముందు ఆగడంతో రవిచంద్రారెడ్డి ని టార్గెట్ చేసి హత్య చేయడానికి కుట్ర చేశారన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది.

భూమా అఖిలప్రియ ప్రాధాన అనుచరుడి హత్యకు కుట్ర
రవిచంద్రారెడ్డి విషయానికి వస్తే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు ప్రధాన అనుచరుడైన రవిచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై గతంలో జరిగిన హత్యాయత్నంతో సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడిని హతమార్చడం కోసమే దుండగులు వచ్చినట్లుగా స్థానిక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో ఉన్న స్కార్పియో వాహనం హైదరాబాద్ కు చెందిన ఓ ద్విచక్ర వాహనానికి సంబంధించిన నెంబర్ ప్లేట్ తో ఉండడంతో, ఆ కారు ఎవరిది అని తేల్చడం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు అనుమానితుల అరెస్ట్ .. పోలీసుల దర్యాప్తు
ఇదే సమయంలో ఆళ్లగడ్డ పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసి విచారణ కూడా జరుపుతున్నట్లుగా సమాచారం. ఏదేమైనా భూమా అఖిలప్రియ ప్రధాన అనుచరుడు హత్యకు కుట్ర జరుగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మళ్ళీ సీమలో ఫ్యాక్షన్ గొడవలు పెరుగుతున్నాయన్న భావన తాజా పరిణామాలతో వ్యక్తం అవుతుంది .