ఎస్వీబీసీ ఛైర్మన్ గా కమెడియన్ పృధ్వీ రూపాయి కూడా తీసుకోలేదా ? అంతా రీయింబర్స్ మెంటేనా !
ఎస్వీబీసీ ఛైర్మన్ గా పనిచేసిన అరునెలల కాలంలో రూపాయి కూడా వ్యక్తిగత ఖర్చులకు తీసుకోలేదంటూ ఈ మధ్య కమెడియన్ పృధ్వీ చేస్తున్న వాదనలో నిజమెంత ? ఎస్వీబీసీ ఖాతాల రికార్డులు ఏం చెబుతున్నాయి ? ఆధారాలున్నా పృధ్వీ వాస్తవాలను దాచిపెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు ? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి..
ఏపీలో గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే
తిరుమల తిరుపతి దేవస్ధానానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ ఛైర్మన్ గా పనిచేసే అవకాశం కమెడియన్ పృధ్వీరాజ్ కు దక్కింది. వైసీపీలో సీనియర్ నేత విజయసాయిరెడ్డితో ఉన్న అనుబంధం, గతంలో పార్టీ ప్రచారం కోసం పనిచేయడం వంటి కారణాలతో ఎస్వీబీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్ధకు పృధ్వీకి అవకాశం కల్పించారు జగన్. అయితే ఆ తర్వాత పృధ్వీ ఏం చేశారు ?

మహిళా ఉద్యోగులతో ఫోన్లు..
ఎస్వీబీసీ ఛైర్మన్ గా వ్యవహరించిన సమయంలో అక్కడే పనిచేస్తున్న పలువురు మహిళా ఉద్యోగులతో ఛైర్మన్ పృధ్వీరాజ్ సంభాషణలు జరిపారు. వాటిలో పలు అభ్యంతరకర అంశాలు ఉన్న నేపథ్యంలో వాటిని సదరు ఉద్యోగులు విజిలెన్స్ కు అందించారు. విజిలెన్స్ విచారణ నేపథ్యంలో పృధ్వీని ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని వైసీపీ పెద్దలు సూచించడం, ఆయన రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ సంభాషణల వ్యవహారాన్ని జనం మర్చిపోతున్నారనుకునే తరుణంలో తాజాగా ఆయన మరో వ్యవహారాన్ని పదేపదే ప్రస్తావించి వార్తల్లోకి తెచ్చారు.

ఎస్వీబీసీ నిధులతో సొంత ఖర్చులు..
ఎస్వీబీసీ ఛైర్మన్ గా పృధ్వీరాజ్ జీతం అక్షరాలా లక్ష రూపాయలు, దీనికి అదనంగా టీటీడీ పరిధిలో ఆయన అధికారిక కార్యక్రమాల కోసం వాహనానికి డీజిల్, డ్రైవర్ ఖర్చుల కోసం మరో 50 వేలు కేటాయించారు. కానీ పృధ్వీ తిరుమలతో పాటు హైదరాబాద్ లోనూ తన వాహనం డీజిల్, డ్రైవర్ ఖర్చులను ఎస్వీబీసీకి బిల్లులు సమర్పించి తీసుకున్నారు. అలాగే స్ధానికంగా ఉంటున్న సమయంలో వంట పాత్రల కొనుగోలు పేరుతో లక్ష రూపాయలు తీసుకున్నారు. తిరుపతి నుంచి చెన్నై వెళ్లేందుకు సైతం ఎస్వీబీసీ వాహనాలను వదిలిపెట్టి ప్రత్యేక వాహనాన్ని బుక్ చేసుకుని వెళ్లేవారు. అలాగే హైదరాబాద్, తిరుపతి మధ్య విమాన ప్రయాణాల ఖర్చులను కూడా ఎస్వీబీసీ ఖాతాలోనే వేశారు. దీంతో పాటు ఎస్వీబీసీ ప్రకటనల్లో నటించే సమయంలో సొంత మేకప్ కిట్లు, సొంత దుస్తుల కొనుగోళ్లకు భారీగా డబ్బులు ఖర్చుపెట్టించేవారు. చిన్నాచితకా ఖర్చులు దీనికి అదనం. ఈ ఖర్చంతా ఎస్వీబీసీ నుంచి తీసుకున్నట్లు అధికారుల వద్ద పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి.
Recommended Video


రూపాయి కూడా తీసుకోలేదంటూ..
ఎస్వీబీసీ చైర్మన్ గా పనిచేసిన సమయంలో పృధ్వీరాజ్ భారీగా ఖర్చుపెట్టినట్లు ఎక్కడో చిన్న ఆరోపణ వచ్చింది. అయితే దీనిపై తాజాగా టీవీ ఛానళ్లకు, మీడియాకు ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూల్లో పదేపదే ప్రస్తావిస్తూ తాను వ్యక్తిగత ఖర్చుల కోసం రూపాయి కూడా తీసుకోలేదంటూ చెప్పుకుంటున్నారు. దీంతో అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగిందో ఆరా తీస్తే దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఇవన్నీ ఎస్వీబీసీ ఉద్యోగులతో పాటు అధికారులకు కూడా తెలిసినా పృధ్వీరాజ్ ఆరోపణలు ఏ స్ధాయికి వెళతాయో చూశాక స్పందించాలని వారు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications