కడుపు మండి ఎపి రైతు వీడియో మెసేజ్: ఉరుకులూ పరుగులూ...
Recommended Video

గుంటూరు: ఓ రైతు పెట్టిన వీడియో అధికారులకు సమస్యగా మారింది. ఏం చేయాలో పాలుపోక ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తాను కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు వీడియో మెసేజ్ పెట్టాడు.
గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాజా అనే రైతు ఆ వీడియో పోస్టు చేశాడు. పాస్ బుక్ ఇవ్వడానికి అధికారులు చేస్తున్న జాప్యంపై విసిగిపోయి అతను ఈ చర్యకు దిగాడు.

ఎకరా భూమి సంక్రమించింది..
తనకు వారసత్వంగా ఎకరా భూమి సంక్రమించిందని, నిరుడు మరో 22 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేస్తే తెగులు సోకి మొత్తం పోయిందని, పంట కోసం తాను చేసిన అప్పు రూ. 8 లక్లలు ఇప్పటికీ వడ్డీతో సహా 10 లక్షల రూపాయలు అయిందని రాజా వీడియో మెసేజ్‌లో చెప్పాడు.

పాస్ పుస్తకం కార్యాలయం చుట్టూ
తన ఎకరా భూమి అమ్మి అప్పు తీర్చేద్దాని నిరుడు 13వ తేదీన స్థానిక సర్వేయర్‌కు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఇప్పటికి పదిసార్లు తనను కార్యాలయం చుట్టూ తిప్పుకున్నాడని, అయినా పాస్ పుస్తకం ఇవ్వలేదని తన గోడును వెళ్లబోసుకున్నాడు.

ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక
అధికారుల తీరుతో విసిగిపోయిన రాజా ఈ నెల 22వ తేదీన కలెక్టర్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. తాను పక్కా తెలుగుదేశం పార్టీ అభిమానిని అని కూడా చెప్పుకున్నాడు. ఏం ప్రభుత్వం ఇది, రైతే రాజన్నారు, ఇదేనా చంద్రబాబు పాలన అని అతను ప్రశ్నించాడు..

నేను చనిపోయిన తర్వాత
తాను చనిపోయిన తర్వాత చంద్రన్న బీమా కింద రూ. 5 లక్షలు ఇస్తారని తెలిసిందని, దయచేసి ఆ మొత్తాన్ని తన కుటుంబానికి ఇవ్వాలని, తన ఎకరా పొలం అమ్మితే ఐదు లక్షల రూపాయలు వస్తాయని, మొత్తం పది లక్షల రూపాయలతో అప్పు తీర్చేయవచ్చునని అతను చెప్పాడు.

కిడ్నీ కావాలంటే ఇస్తా...
ఈ నెల 22వ తేద లోపు ఎవరికైనా కిడ్నీ కావాలంటే ఇస్తానని రాజా చెప్పాడు. వ్యవసాయం తప్ప ేమీ తెలియని తనకు ఎలా అప్పులు తీర్చుకోవాలో తెలియక ఈ సాహసం చేస్తున్నట్లు చెప్పాడు. తనకు రెండున్నరేళ్ల పాప, 10 నెలల బాబు ఉన్నారని, ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలని అన్నారు.

ముఖ్యమంత్రి గారూ చూడండి...
రైతులు ఎలా జీవిస్తున్నారో, పెద్దగా చదువుు లేనివారు కార్యాలయాల చుట్టూ తిరుగుతారని అంటూ మీ ప్రభుత్వంలో అధికారుల పనితీరు ఎలా ఉందో చూడండి ముఖ్యమంత్రిగారూ. నాలాగా మరెవ్వరూ బాధపడకూడదని కోరుతున్నాను అని అన్నాడు. ఈ వీడియో ప్రభుత్వాధికారుల దృష్టికి వెళ్లింది. గురజాల ఆర్డీవో మురళి దానిపై విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications