అన్నదాత సుఖీభవలో రైతులు మోసపోయారా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల సంక్షేమంపై చంద్రబాబుకు ఆలోచన లేదని, అబద్ధాలు చెబుతూ క్రెడిట్ చోరీ చేస్తూ, తనను తాను మేధావిగా చెప్పుకొని మార్కెటింగ్ చేసుకోవడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదని మాజీమంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కడప జిల్లాలో రెండో విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలని ఆయన ఆక్షేపించారు.
రైతులకు దాదాపు 17 వేల కోట్ల రూపాయల మోసం
రెండేళ్లలో రైతులకు ప్రభుత్వం దాదాపు 17 వేల కోట్ల రూపాయల మోసం చేసిందని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. ఏకంగా ఏడు లక్షల మంది రైతులను తొలగించడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని, కేంద్ర నిధులతో సంబంధం లేకుండా ఈ మొత్తాన్ని అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.

చంద్రబాబుకు కన్నాబాబు డిమాండ్
గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలలో కేవలం పదివేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు అని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కౌలు రైతులను అసలు రైతులుగానే గుర్తించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కూటమిపాలనలో వందలాది రైతులు ఆత్మహత్య చేసుకున్న ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు అన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో 7లక్షల మంది రైతులు ఎందుకు తగ్గిపోయారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కన్నాబాబు డిమాండ్ చేశారు.
అన్నిటికీ తానే సృష్టికర్త అని చంద్రబాబు ప్రచారం
చంద్రబాబుకు ప్రపంచంలో ఏది బెస్ట్ ఉంటే దానిని తీసుకుని, దానిపై తనదైన ముద్ర వేసుకుని, తానే సృష్టికర్త అన్నట్టు ప్రచారం చేసుకోవడం అలవాటని కన్నబాబు విమర్శలు గుప్పించారు. వైయస్సార్ రైతు భరోసా పథకం పేరు మార్చి అన్నదాత సుఖీభవ పేరుతో అందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రాప్ చేయడం చేతకాని వ్యక్తి, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తానని చెబుతున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు.
రైతుల మేలు కోసం ఒక్క పనీ చెయ్యలేని చంద్రబాబు
పబ్లిసిటీ చేసుకోవడం తప్ప రైతుల మేలు కోసం ఒక్క మాట కూడా చెప్పలేకపోయారని కన్నబాబు పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడే ఒక పని చేయని చంద్రబాబు ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు 53.58 లక్షల మంది రైతులకు ఏడాదికి 20,000 చొప్పున రెండు సంవత్సరాలలో 40000 ఇవ్వాల్సి ఉందన్నారు కన్నబాబు.
రెండు విడతలలో రైతులకు ఇచ్చింది ఇదే
ఈ లెక్కన రెండేళ్లలో రైతుల ఖాతాలలో 21,433 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంటే, 5,000 చొప్పున 46.85 లక్షల మంది రైతులకు రెండు విడతలలో ఇచ్చిన మొత్తం కేవలం 4685 కోట్ల రూపాయలు మాత్రమేనని మాజీ మంత్రి కన్నబాబు తెలిపారు. కౌలు రైతులకు ఈ పథకాన్ని అమలు చేయకపోవడంపైన చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులు ఎందుకు తగ్గిపోయారో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications