తిరుమలలో వీటికి కొత్త పేర్లు- అందరి అంగీకారం?
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 79,429 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,889 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.98 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 23 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 నుండి 8 గంటల సమయం పట్టింది.
తిరుమలలోని వీధులు, కూడళ్ళు, ఇతర ముఖ్య ప్రదేశాల పేర్లు మారనున్నాయి. శ్రీవారి ఆలయ సంప్రదాయాలు, పురాణ ఇతిహాసాలు, వైష్ణవ సంప్రదాయాల పేర్లను వాటికి పెట్టనున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉట్టిపడేలా ఈ పేర్లను ఎంపిక చేశారు. దీనిపై టీటీడీ పాలక మండలి ఇప్పటికే ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ తాజాగా తన తుది నివేదికను సిద్ధం చేసింది. పలు పేర్లను ఇందులో పొందుపరిచింది. ఈ నివేదిక త్వరలో టీటీడీ పాలకమండలి చేతికి అందనుంది.

తదుపరి బోర్డు సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం తిరుమలలో చాలా రోడ్లు, జంక్షన్లకు అధికారికంగా ఎటువంటి పేర్లు లేవు. ముల్లగుంట కార్ పార్కింగ్, జీఎన్సీ రోడ్డు, ఎంబీసీ రోడ్డు, రామ్ బగీచా గెస్ట్ హౌస్ సర్కిల్, ఏటీసీ సర్కిల్, మేదరమిట్ట, పూటకూళ్ళ మిట్ట వంటి వాటి ద్వారా గుర్తింపు పొందుతున్నాయి. వీటిని మార్చాలని టీటీడీ నిర్ణయించింది.
దీనికోసం ఓ కమిటీని సైతం వేసింది. జాతీయ సంస్కృత యూనివర్సిటీ దూరవిద్య డైరెక్టర్ ఆచార్య చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడాసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ ధూళిపాల ప్రభాకర కృష్ణమూర్తి సభ్యలుగా ఉన్న కమిటీ ఇది.
సంస్కృతం, తెలుగు సాహిత్యం, పౌరాణిక అధ్యయనాలలో నిష్ణాతులైన ఈ సభ్యులు తిరుమల ఆధ్యాత్మిక స్వభావానికి తగిన, శాస్త్రపరమైన పేర్లను సిఫార్సు చేశారు. వాటిని తమ నివేదికలో పొందుపరిచారు. దీని ప్రకారం.. తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధులకు నాలుగు వేదాల పేర్లు పెట్టాలని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. రుగ్వేదం, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదం గా ఖరారు చేసినట్లు సమాచారం. రామ్ బగీచ రోడ్డుకు శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టాలని నిర్ణయించారు. అన్నమాచార్య, గరుడాద్రి, పద్మావతి తదితర పేర్లను ఎంపిక చేశారు.












Click it and Unblock the Notifications