ఏపీ పోలీస్ శాఖకు ఐదు జాతీయ అవార్డులు ; టెక్నాలజీలో సత్తా చాటిన ఏపీ పోలీస్ : డీజీపీ గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు ఐదు జాతీయ అవార్డులు వచ్చాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఈ ఐదు అవార్డులు టెక్నాలజీ విభాగంలో వచ్చాయని పేర్కొన్న ఆయన, ఈ రోజు నిజంగా ఏపీ పోలీసులు గర్వించదగిన రోజని డీజీపీ గౌతమ్ సవాంగ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో మరోసారి ఏపీ పోలీస్ శాఖ సత్తా చాటిందని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021 లో ఏపీ పోలీస్ శాఖకు ఐదు అవార్డులు
కేంద్ర ప్రభుత్వం, డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్-2021 ను ప్రకటించిందని వెల్లడించిన ఏపీ డీజీపీ కేంద్రం ప్రకటించిన అవార్డుల గురించి వెల్లడించారు. జాతీయ స్థాయిలో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లో వరుసగా మూడోసారి మొదటి స్థానంలో ఏపీ పోలీస్ శాఖ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పాస్ పోర్ట్ దరఖాస్తు వెరిఫికేషన్ ను పోలీసులు పూర్తి చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. టెక్నాలజీ రంగంలో జాతీయ స్థాయిలో అవార్డును ప్రకటించిన డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డ్స్ 2021లో అత్యంత అధునాతన టెక్నాలజీని వినియోగించడంలో 4 అవార్డుల ఏపీ పోలీస్ శాఖ సొంతం చేసుకుందని పేర్కొన్నారు. ఇక మరో అవార్డు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఏపీ పోలీస్ శాఖలో సిబ్బంది ఆరోగ్య సమాచారాన్ని పొందుపరిస్తే దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 130 అవార్డులు
టెక్నాలజీలో జాతీయ స్థాయిలో ప్రకటించిన అవార్డులలో పోలీస్ హెడ్ హెడ్ క్వార్టర్స్ 3 అవార్డులను కైవసం చేసుకోగా, అనంతపురం ఒక అవార్డును దక్కించుకుంది అని, ఇక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఇచ్చిన ఆరోగ్య సమాచారానికి మరో అవార్డు దక్కిందని పేర్కొన్నారు. కేవలం స్వల్ప కాలవ్యవధిలో జాతీయస్థాయిలో అత్యధికంగా 130 అవార్డులను దక్కించుకొని దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ నిలిచిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టంచేశారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, HAWK, బాడి వొర్న్ కెమెరా స్ట్రీమింగ్, కోవిడ్ ట్రాకర్ లు జాతీయ స్థాయిలో సత్తా చాటాయని వెల్లడించారు.

రికార్డ్ స్థాయిలో అవార్డులు .. తమ బాధ్యత పెరిగిందన్న ఏపీ డీజీపీ
కరోనా మహమ్మారి సమయంలో ఏపీ పోలీసులు తమ పనితీరుతో ప్రశంసలందుకున్నారు అని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. అవార్డులు పెరుగుతున్న కొద్దీ పోలీస్ శాఖ పని తీరును మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొద్ది నెలల కాలంలోనే రికార్డ్ స్థాయి అవార్డులను దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ విభాగం ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఈ అవార్డులు తమ బాధ్యత ను మరింతగా పెంచాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు .

పారదర్శకత, జవాబుదారీ తనం,సత్వర న్యాయం గీటురాళ్ళు
ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంతో , మరింత త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు సాధిస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అభిప్రాయపడ్డారు. పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర న్యాయం వంటి అంశాలకు గీటురాయిగా ఏపీ పోలీసు విభాగం నిలిచిందని కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications