చేతులు కట్టేసి, బాది, వేడి నూనె పోసి చిన్నారిని చంపేశారు
సంగారెడ్డి: హెడ్ కానిస్టేబుల్ దంపతుల దాడికి ఐదేళ్ల చిన్నారి బలైంది. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ కిరాతక దంపతులు ఐదేళ్ల చిన్నారిని చేతులు కట్టేసి, చితకబాది, ఆ తర్వాత వేడి నూనె పోశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
ఈ విషయం గురించి డీఎస్పీ ఎం.తిరుపతన్న ఇచ్చిన వివరాల మేరకు - మెదక్ జిల్లా, జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం హెడ్‌కానిస్టేబుల్ సయ్యద్ జాకిర్ హుస్సేన్ అహ్మద్, భార్య రజియా సుల్తానాలు కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో నివాసముంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం సయ్యద్ జాకిర్ హుస్సేన్ ఓ దర్గా నుంచి షాహిస్తా సబా (5)ను అనే బాలికను తీసుకువచ్చాడు. పెంపకానికి తీసుకువచ్చారని అంటున్నారు.

అయితే తీసుకువచ్చినప్పటి నుంచీ ఆ బాలికపై హెడ్‌కానిస్టేబుల్ దంపతులు వేదిస్తున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా గత నెలలో బాలిక చేతులు, కాళ్లకు వాతలు పెట్టి, బాలికపై వేడి నూనె పోశారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక పరిస్థితిని గమనించిన స్థానికులు సమాచారంతో గురువారం అక్కడికి చేరుకున్న శిశు సంరక్షణ అధికారి ఎం.ఎస్.చంద్ర బాలికను సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.
అయితే అక్కడ చికిత్స పొందుతున్న షాహిస్తా సబా మృతి చెందింది. చంద్ర ఫిర్యాదు మేరకు సంగారెడ్డి పోలీసులు సయ్యద్ జాకిర్ హుస్సేన్ అహ్మద్, భార్య రజియా సుల్తానాలు అదుపులోకి తీసుకున్నారు. ఆ దంపతులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి, ఆ బాలిక ఎవరు, ఎందుకు తీసుకువచ్చారు అంటూ పలు కోణాలలో విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications