వైసీపీ, టీడీపీ అవినీతిపార్టీలు-కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు...
ఏపీలో ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీపై మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఇరు పార్టీలు కలిసి రాష్ట్ర అభివృద్ధిని ఎలా అడ్డుకుంటున్నాయన్న దానిపై కిరణ్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. శ్రీకాళహస్తిలో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ప్రసంగించిన కిరణ్.. బీజేపీకి ఎందుకు మద్దతివ్వాలనేది స్పష్టం చేశారు.
ప్రజా జీవితంలో ఉండాలా వద్దా అనే ప్రశ్నను తాను ఎదుర్కొన్నానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజా జీవితంలో ఉండాలంటే ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి, రాష్ట్రానికి చెడు జరుగుతోందన్నారు. అందుకే బీజేపీలో చేరానన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో కరువు ఎక్కువగా ఉండేదని, దీంతో తాను ప్రతీ కుగ్రామానికీ నీరు ఇచ్చేలా రూ.7400 కోట్లతో ప్రాజెక్టు కేటాయించానని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు కోసం తన కేబినెట్ సహచరుల్ని దీనిపై ఒప్పించడానికి చాలా కష్టపడ్డానని కిరణ్ తెలిపారు. అయితే విభజన తర్వాత సొంత జిల్లాకు చెందిన చంద్రబాబే దాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు.

అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రద్దు చేసిందని, వైసీపీ ఇప్పటికీ పట్టించుకోవడం లేదని కిరణ్ ఆరోపించారు. ఇలాంటి పార్టీలు అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఈ రెండు పార్టీల అవినీతి గురించి మాట్లాడితే రోజులు సరిపోవన్నారు. తిరుమల కొండ కింద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కోసం భూమి కేటాయించామని, డబ్బు కూడా రాష్ట్రంతో సంబంధం లేకుండా బీసీసీఐ, ఏసీఏ రూ.120 కోట్లు భరించేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. అయినా చిన్న భూమి సమస్యతో దాన్ని రద్దు చేశారన్నారు. హైటెక్స్ తరహాలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ పెడతామంటే దాన్నీ అడుకున్నారని వైసీపీ, టీడీపీలపై కిరణ్ ఆరోపణలు చేశారు.
ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర నిధులతో తమ ఖజానా నింపుకుంటున్నాయని, వీటితో రాష్ట్రానికి ఏ ప్రయోజనం లేదని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. బీజేపీ, మోడీ నాయకత్వంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. అవినీతిపరుల్ని ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఏరిపారేస్తోందని, ఇలాంటి వారందరినీ ఏరేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.












Click it and Unblock the Notifications