జగన్ కూ, చంద్రబాబుకూ మధ్య ఎంత తేడా ? టీడీపీ మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమం అమలు చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం సంక్షేమం కంటే అభివృద్ధే ముఖ్యమని భావించింది. ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడాను ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు విశ్లేషకులు కూడా పలు సందర్భాల్లో పోల్చారు. ఇప్పుడు టీడీపీ మాజీ మంత్రి ఒకరు పేదల సంక్షేమం విషయంలో జగన్, చంద్రబాబు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడాను మరోసారి చక్కగా విశ్లేషించారు.
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో రావెల కిషోర్ బాబు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జనసేనలో, బీజేపీలో కూడా చేరిన ఆయన తాజాగా వైసీపీ తీర్దం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాను వైసీపీని ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాల్ని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా పేదల సంక్షేమం విషయంలో చంద్రబాబు, జగన్ ఆలోచన విధానాల మధ్య ఉన్న తేడాను రావెల విశ్లేషించారు.

చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆటోమేటిగ్గా ఆ ఫలితాలు పేదలకు వస్తాయని నమ్మే వ్యక్తి అని, పెత్తందారీ వ్యవస్ధపై చంద్రబాబుకు నమ్మకం ఉండేదని రావెల చెప్పుకొచ్చారు. జగన్ సర్కార్ లో మాత్రం నేరుగా సంక్షేమ పథకాలకే లబ్దిదారులకు అందాలి, మధ్యలో ఎవరూ ఉండకూడదని భావిస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వమని,
జగనన్న ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని మాజీ మంత్రి తెలిపారు.
పేదలు వెనుకబాటు, అజ్ఞానం, నిరక్షరాస్యత నుంచి ఎలా అభివృద్ధి చెందాలనేది జగన్ తపనని రావెల తెలిపారు. చంద్రబాబు వచ్చే సరికి అభివృద్ధి ఫలితాలు గ్రామ స్ధాయికి వెళ్తాయని నమ్మే వ్యక్తి అన్నారు. చంద్రబాబు చేసే అభివృద్ధి వల్ల లబ్దిపొందేది కేవలం ఒక వర్గమే అన్నారు. వందల కోట్లు సంపాదించే వ్యక్తి వేల కోట్లు, వేల కోట్లు సంపాదించే వారు లక్షల కోట్లు సంపాదిస్తారన్నారు. ఇది అట్టడుగు వర్గాల వారికి లాభం ఉండదన్నారు. జగన్ పేదలకు ఇస్తున్న సంక్షేమం సమసమాజ నిర్మాణం దిశగా ఉందని, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నారన్నారు.
ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ అసమానతలు రూపుమాపి సమసమాజం నెలకొల్పేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని రావెల విశ్లేషించారు. చంద్రబాబు ఓ పెద్ద రాజధాని నిర్మించాలి, అతిపెద్ద నగరాన్ని నిర్మించాలనే ఊహాజనిత కార్యక్రమం చేపట్టి రాజధానీ నిర్మించలేక, తాత్కాలిక రాజధాని కూడా నిర్మించలేకపోయారన్నారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా తాను వెనుకబడిన వర్గాల కోసం ఏదైనా చేద్దామంటే చంద్రబాబు ఇష్టపడలేదన్నారు. అభివృద్ధి ద్వారా పేదలు బాగుపడాలంటాడే తప్ప, నేరుగా వారికి లబ్ది చేకూర్చాలనే ఆలోచన లేదన్నారు.
ఇది పెత్తందారీ స్వభావం, భూస్వామ్య విధానం, ధనిక వర్గాలకు కొమ్ముకాసే విధానమన్నారు. రాజధానిలో 50 వేల మంది పేదలకు పట్టాలు ఇచ్చి ప్లాట్లు కేటాయిస్తే ఇక్కడ ధనికులు మాత్రమే ఉండాలని చంద్రబాబు కోర్టు కెళ్లి అడ్డుకున్నారని రావెల ఆరోపించారు. దీన్ని బట్టి జగనన్న ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ధనికులకు కొమ్ముకాసే ప్రభుత్వమని అర్ధమవుతోందన్నారు. 50 శాతం నామినేటెడ్ పోస్టులు ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన ప్రభుత్వం జగన్ ది అని రావెల ప్రశంసించారు.












Click it and Unblock the Notifications