ఎన్టీఆర్ నమ్మారు - వెన్నుపోటుకు గురయ్యారు : వెంకయ్యనాయుడు..!!
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నందమూరి కుటుంబ సభ్యలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ చారిత్రక పురుషడని అభివర్ణించారు. రాజకీయాల్లో విప్లవాన్ని తీసుకొచ్చిన మహావ్యక్తి అంటూ కొనియాడారు. పేద వారి కోసం అనేక పథకాలు తెచ్చారని కీర్తించారు. ఆడపడుచులను ఆదరించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. బలహీన పేద వర్గాలకు చేయూతనిచ్చారని చెప్పారు.
ఇదే సమయంలో ఎన్టీఆర్ వ్యక్తిత్వం గురించి వెంకయ్య నాయుడు వివరించారు. ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి, బోళాతనంగా ఉండేవారని తెలిపారు. అందరినీ నమ్మేవారు, అందుకే వెన్నుపోటుకు గురయ్యారని వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, కుతంత్రాలను ఎన్టీఆర్ గమనించలేకపోయారన్నారు. సిద్దాంతాలు వేరైనా పద్ధతులు పాటించే వారంటే తనకు గౌరవమని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ స్పూర్తిని నేటి తరం కొనసాగించాలని కోరారు. ఉపరాష్ట్రపతి అయ్యాక రాజకీయాలు వదిలేశానని... కానీ ప్రజలను కలవడం మాత్రం మానుకోలేదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉచితాలు అనుచితం అని... చేపలు పెట్టడం కాదు పట్టడం నేర్పాలని హితవుపలికారు. సమాజంలో అశాంతి పెరుగుతుందని.. మనుషుల్లో అశాంతి పెరిగిందని వ్యాఖ్యానించారు.

ఏపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న వెంకయ్య నాయుడు ప్రభుత్వాలు అందించే ఉచితాల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో పాటుగా మాతృబాష ప్రాధాన్యతను వివరిస్తున్నారు. తాజాగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆయన కీలక సూచనలు చేసారు. ప్రాథమిక విద్య మాతృబాషలో ఉండి తీరాలని.. ఇది తప్పని సరని చెప్పుకొచ్చారు. పరిపాలన భాష మాతృ భాషలో ఉండాలని న్యాయవ్యవస్థలో తీర్పులు తెలుగులో ఉండాలన్నారు. శ్వాస, భాష రెండు మనకు ఎంతో ముఖ్యం శ్వాస, భాష రెండు అగకూడదు భాష కళ్ళు లాంటిది...ఇంగ్లీష్ కళ్లద్దాలు లాంటిది కళ్ళు వుంటేనే కళ్లద్దాలు ఉపయోగపడతాయన్నారు. తాను ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల పాటలు వింటానని చెప్పారు. ఇతర దేశాల వారు మన భాషా గురించి మాట్లాడుతున్నారన్నారని వెంకయ్య చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications