Vijayawada : విజయవాడలో కొండచరియలు పడి 4గురు మృతి-ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ బంద్..!
విజయవాడను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అదే సమయంలో నగరంలో ఉన్న కొండలపై పడుతున్న బండరాళ్లు జనం ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇవాళ ఉదయం మెగల్ రాజపురంలో కొండచరియలు విరిగిన ఘటనలో సున్నపుబట్టీల సెంటర్ కు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగి పడిన ఘటనలో నలుగురు మృతి చెందడం పై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తుచేయాలని అధికారులకు సీఎం సూచించారు. రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అధికారుల సూచనలను ప్రజలు తప్పకపాటించాలని ఆయన కోరారు.

మరోవైపు భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రిపైనా బండరాళ్లు కూలుతున్నాయి. దీంతో ఘాట్ రోడ్డుపై రాకపోకల్ని నిలిపేశారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న సమాచార కేంద్రంపై బండరాళ్లు పడటంతో ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో గుడిపైకి వెళ్లకుండా సిబ్బంది రాకపోకల్ని నిలిపేస్తున్నారు.












Click it and Unblock the Notifications