రాజీనామా పుకారే? వైవీతో భేటీ తర్వాత గాజువాక వైసీపీ ఇన్ ఛార్జ్ దేవన్ రెడ్డి!
ఏపీలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పుల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నిన్న మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవితో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. అనంతరం విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో ఒకే రోజు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న రెండు సీట్లలో రాజీనామాల పర్వం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో ఇవాళ ఉత్తరాంధ్ర వ్యవహారాల వైసీపీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డితో తిప్పల దేవన్ రెడ్డి భేటీ అయ్యారు.ఉదయం ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఆయన కుమారుడు, గాజువాక ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాజీనామా వ్యవహారంపై చర్చించారు. అనంతరం బయటికి వచ్చిన వారు దీనిపై క్లారిటీ ఇచ్చారు.

గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ తాను గాని, తన కుమారులు కానీ ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తులుగా ఉంటామని ప్రకటించారు. పార్టీ కి విధేయులుగా ఉంటామన్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కంకణబద్ధులై ఉంటామని తెలిపారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, తమకు అదే ముఖ్యం అన్నారు. తద్వారా పార్టీకి తమ విధేయతను ప్రకటించారు.
మరోవైపు పార్టీకి రాజీనామా చేసినట్లు జరిగిన ప్రచారంపై దేవన్ రెడ్డి స్పందిస్తూ.. నిన్న తాను వ్యక్తిగత పనుల మీద బయటకి వెళ్ళానని, వెళ్లేముందు ఇంచార్జి సుబ్బారెడ్డితో మాట్లాడి వెళ్ళానన్నారు. అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవని, నిన్న తాను మళ్ళీ సిటీకి వచ్చే లోపు తన మీద చాలా పుకార్లు లేపారన్నారు. అయినా తన తండ్రి ఎమ్మెల్యేగా ఉండగా తానెందుకు పార్టీకి రాజీనామా చేస్తానని ప్రశ్నించారు. తాను పార్టీతోనే వున్నానని సుబ్బారెడ్డికి వివరణ ఇచ్చేందుకే తండ్రితో కలిసి వచ్చానన్నారు. తాము ఎప్పటికి ముఖ్యమంత్రి జగన్ మాటకి, పార్టీకి కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications