సినీఫక్కీలో ఏపీలో గంజాయి ఛేజింగ్... జలాశయంలోకి దూసుకెళ్లిన కారు; ఆపై ఏం జరిగిందంటే!!
కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. ఎస్ఈబీ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు, రెవిన్యూ శాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం తనిఖీలు చేస్తున్న అధికారులకు పట్టుబడకుండా కొత్త మార్గాలలో గంజాయి రవాణాకు ప్రయత్నిస్తున్నారు.

సినీ ఫక్కీలో గంజాయి కారును వెంబడించిన పోలీసులు .. జలాశయంలోకి దూసుకెళ్లిన కారు
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం భూపతిపాలెం వద్ద పోలీసులు సినీ ఫక్కీలో గంజాయి తరలిస్తున్న ఓ కారును వెంబడించారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుండి మైదాన ప్రాంతం రహదారిపై వెళుతున్న గంజాయి రవాణా వాహనాన్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించారు.
అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆపకుండా వేగంగా వెళ్ళటంతో అనుమానించిన పోలీసులు వాహనాన్ని వెంబడించారు. పోలీసులకు పట్టుబడ్డకుండా తప్పించుకుని వెళ్లే క్రమంలో సదరు వాహనం డ్రైవర్ వేగంగా కారు నడపడంతో భూపతిపాలెం వద్ద డివైడర్ ను ఢీకొట్టిన కారు అక్కడే ఉన్న జలాశయంలోకి దూసుకెళ్లింది .

జలాశయం నుండి క్రేన్ తో వాహనం బయటకు.. 300కిలోల గంజాయి సీజ్
కారులో ఉన్న ఒక వ్యక్తి పరారవగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జలాశయం నుండి క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. అందులో 300 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినీ ఫక్కీలో పోలీసులు వాహనాన్ని వెంబడిస్తున్నా, పోలీసులకు దొరకకుండా గంజాయి స్మగ్లర్లు తప్పించుకుని వెళ్లే ప్రయత్నాలు చేస్తుండటం అనేక కేసులలో కనిపిస్తుంది.

గుమ్మడికాయల లారీలో గంజాయి.. పట్టుకున్న పోలీసులు
తాజాగా మరో కేసులో ఓ లారీలో 530 కిలోల గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని గుర్తించిన పోలీసులు ఒక లారీలో గుట్టుచప్పుడు కాకుండా గుమ్మడికాయల చాటున జరుగుతున్న గంజాయి దందా వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. చింతూరు పోలీస్ స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు యూపీ రాష్ట్రానికి చెందిన సౌరవ్ కుమార్, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ప్రతాప్ కుమార్, కుర్ర సన్యాసిరావు, కోహ్లీ అర్జున్ ను గుమ్మడికాయల చాటున గంజాయి రవాణాకు పాల్పడుతున్న కేసులో అరెస్టు చేశారు. ఆపై గంజాయి రవాణా కు ఉపయోగించిన లారీని సీజ్ చేశారు.

ఏపీలో విచ్చలవిడిగా గంజాయి దందా.. రోజుకో ఘటన
నిత్యం విశాఖ ఏజెన్సీ నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారని తెలిసినా, ఏపీ ప్రభుత్వం గంజాయిపై ఆపరేషన్ పరివర్తన్ ద్వారా ఉక్కుపాదం మోపాలని ప్రయత్నాలు చేస్తున్నా సరే నిత్యం గంజాయి స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉండటం రాష్ట్రంలో గంజాయి దందా తీరును అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది. రోజుకో గంజాయి సంగ్లింగ్ ఘటనతో చాప క్రింద నీరులా గంజాయి స్మగ్లర్లు దందా చేస్తున్నారని అర్ధం అవుతుంది.