విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం తెలంగాణా ఉద్యమంలా .. వైజాగ్ లో మిలియన్ మార్చ్ కు గంటా శ్రీనివాస్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే గంటా శ్రీనివాస్ రాజీనామా స్పీకర్ ఫార్మాట్ లో లేని కారణంగా మరోమారు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం కోసం సాగుతున్న ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాంధ్ర ప్రజల గుండెచప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్
తాను విశాఖలోనే ఎదిగానని, ఇక్కడే బ్రతుకుతున్నానని అందుకే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశానని పేర్కొన్న గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర ప్రజల గుండెచప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తున్న కార్మికులు ఈరోజు నుంచి నిరాహార దీక్షలకు దిగారని, ఇందులో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. పశ్చిమబెంగాల్లో సింగూరు, విశాఖలో జిందాల్ పరిశ్రమలకు వ్యతిరేకంగా గతంలో ఉద్యమాలు కొనసాగాయని, అప్పుడు వాటిని అడ్డుకున్నారని పేర్కొన్నారు .

కేంద్రానికి తెలిసేవిధంగా మిలియన్ మార్చ్ నిర్వహించాలన్న గంటా
ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా ఉద్యమాలు చేయాలని గంటా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కేంద్రానికి తెలిసేవిధంగా మిలియన్ మార్చ్ నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉవ్వెత్తున ఎగిసి పడిందో అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం కొనసాగించాలని గంటా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసేది కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ అని పేర్కొన్న గంటా శ్రీనివాస్, కార్మికుల పక్షాన తాను పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు.
అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి
స్టీల్ ప్లాంట్ లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన ఆయన ప్రభుత్వం ఈ విషయంపై అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని, అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి ప్రధానిని కలిసే బాధ్యత తీసుకోవాలని గంటా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మరోమారు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను పంపించిన గంటా శ్రీనివాస్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమాన్ని వేదికగా చేసుకొని రాజకీయంగా మరోమారు ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు.