ఏపీలో నిరుద్యోగ యువతకు 4 లక్షల సబ్సిడీతో కొత్త పథకం.. త్వరపడండి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది. డీ-ఫార్మసీ, బీ-ఫార్మసీ లేదా ఎం-ఫార్మసీ చదివిన బీసీ యువతీ యువకులు జెనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు భారీ సబ్సిడీని అందిస్తోంది. ఒక్కో షాపు ఏర్పాటుకు సుమారు రూ.8 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఇందులో ప్రభుత్వం 50 శాతం మొత్తం అయిన రూ.4 లక్షలను సబ్సిడీ రూపంలో ఇస్తుంది.
తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 198 జెనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటు
మిగిలిన రూ.4 లక్షలను బ్యాంకు రుణంగా అందిస్తారు. దీని వల్ల లబ్ధిదారులు తమ సొంత డబ్బు ఒక్క రూపాయి కూడా పెట్టకుండానే వ్యాపారం ప్రారంభించవచ్చు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 198 జెనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విడతకు రూ.7.92 కోట్ల సబ్సిడీ నిధులు కేటాయించారు. బీసీ-ఎ, బీసీ-బి, బీసీ-డి, బీసీ-ఈ కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లు, అర్హతల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ప్రతి మండలంలో కనీసం ఒక జెనరిక్ షాపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ లక్ష్యం
భవిష్యత్తులో ప్రతి మండలంలో కనీసం ఒక జెనరిక్ షాపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గానికి చెందినవారై, ఆంధ్రప్రదేశ్ స్థానికులై ఉండాలి. ఫార్మసీ కౌన్సిల్ గుర్తింపు పొందిన డీ-ఫార్మసీ, బీ-ఫార్మసీ లేదా ఎం-ఫార్మసీ అర్హత ఉండాలి. ఇప్పటికే సొంత మెడికల్ షాపు నడుపుతున్నవారు అనర్హులు.
జెనరిక్ మందుల షాపుల వల్ల సామాన్యులకు బిగ్ రిలీఫ్
కేవలం మొదటిసారి స్వయంఉపాధి ప్రారంభించాలనుకునే యువతకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. షాపుకు తగిన స్థలం, ఫర్నిచర్, ప్రాథమిక ఏర్పాట్లు లబ్ధిదారులే చేసుకోవాలి. అవసరమైన అడ్వాన్స్ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా మంజూరు చేయిస్తారు. ఈ జెనరిక్ మందుల షాపుల వల్ల సామాన్యులకు కూడా పెద్ద ఉపశమనం లభిస్తుంది. WHO-GMP ప్రమాణాలతో తయారైన నాణ్యమైన జెనరిక్ ఔషధాలు బ్రాండెడ్ మందులతో పోలిస్తే 50 నుంచి 80 శాతం వరకు చౌకగా లభిస్తాయి.
అర్హులైన యువత త్వరగా దరఖాస్తు చేసుకోండి
ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల రోగులకు నెలవారీ మందుల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఒకవైపు నిరుద్యోగ యువతకు గౌరవప్రదమైన ఉపాధి, మరోవైపు పేద, మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరల్లో మందులు అందించడం ఈ పథకం లక్ష్యం. అర్హులైన యువత త్వరగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications