Ghulam Nabi Azad : 'గులామీ నుంచి ఆజాదీ'-కాంగ్రెస్ నుంచి నిష్కృమణపై సాయిరెడ్డి ట్వీట్
కాంగ్రెస్ పార్టీకి, పదవులకు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ గుడ్ బై చెప్పారు. పార్టీ యువనేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ అమ్మ సోనియా గాంధీకే లేఖ రాశారు. ఇందులో రాహుల్ కోటరీ, నిర్ణయాల్ని తప్పుబట్టారు. అయితే ఆజాద్ రాజీనామాపై ఆయన సొంత పార్టీ కాంగ్రెస్ తో పాటు పలు రాజకీయపార్టీలకు చెందిన నేతలు స్పందిస్తున్నారు.
ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఆజాద్ రాజీనామా స్పందించారు. ఆజాద్ రాజీనామా నిర్ణయం తెలియగానే సాయిరెడ్డి ట్వీట్ పెట్టారు. ఆజాద్ ను సమర్ధిస్తున్నట్లుగా, కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శిస్తున్నట్లుగా ఉన్న ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో విజయసాయిరెడ్డి కాంగ్రెస్ అధిష్టానం గులామీ(బానిసత్వం) నుంచి ఆజాదీ(విముక్తి) లభించిందంటూ పేర్కొన్నారు.

ఎట్టకేలకు నెహ్రూ వంశం బానిసత్వం నుంచి ఆజాద్ కు విముక్తి లభించిందని విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే ఈ ధైర్యవంతమైన నిర్ణయం తీసుకున్నందుకు శుభాకాంక్షలు అంటూ ఇంగ్లీష్ లో సాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో పాటు మీ ఆత్మసాక్షి మాట వినడంలో ఆలస్యమేమీ కాలేదంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తద్వారా మనస్సాక్షి చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ రాజీనామా చేశారనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగా జగన్ కు వ్యతిరేకంగా అధిష్టానం నిర్ణయాలు తీసుకోవడంలో ఆజాద్ పాత్ర కూడా ఉందని వైసీపీ నేతలు భావిస్తుంటారు. అలాగే జగన్ తండ్రి దివంగత వైఎస్సార్ కు ఆప్తుడిగా ఉన్న ఆజాద్.. ఆయన మరణం తర్వాత జగన్ కు సహకరించలేదనే అభిప్రాయం కూడా ఉంది. దీంతో రాజ్యసభలోనూ ఎంపీగా ఉన్నప్పుడు ఆజాద్ కు వ్యతిరేకంగానే సాయిరెడ్డి వ్యవహరించేవారు. దీంతో సాయిరెడ్డి కూడా కాంగ్రెస్ విధానాల్ని తప్పుబడుతూ కౌంటర్లు ఇచ్చేవారు. చివరికి ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగియడం, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ను వీడిపోవడం జరిగిపోయాయి.












Click it and Unblock the Notifications